60 వేలకు చేరువలో..

10 May, 2020 04:08 IST|Sakshi

దేశంలో ఒక్కరోజులో 3,320 పాజిటివ్‌ కేసులు, 95 మరణాలు

న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. ఈ వైరస్‌ వల్ల మరణాలు 2 వేలకు, పాజిటివ్‌ కేసులు 60 వేలకు చేరువవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు ఒక్కరోజులో 95 మంది కరోనా కాటుతో మృతిచెందారు. కొత్తగా 3,320 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటిదాకా మొత్తం మరణాలు 1,981కు, పాజిటివ్‌ కేసులు 59,662కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కరోనా కేసులు 39,834 కాగా, 17,846 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. రికవరీ రేటు 29.91 శాతానికి పెరిగింది.

రోజుకు 95 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు  
దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ తెలిపారు. ప్రస్తుతం రోజుకు దాదాపు 95 వేల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటిదాకా 15,25,631 పరీక్షలు నిర్వహించామన్నారు. 332 ప్రభుత్వ, 121 ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో ఈ టెస్టులు జరుగుతున్నాయని వివరించారు. ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా నియంత్రణ చర్యలపై మంత్రి హర్షవర్ధన్‌ శనివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని హర్షవర్ధన్‌ సూచించారు. ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం, త్రిపుర మినహా మిగిలిన రాష్ట్రాలు గ్రీన్‌ జోన్‌లోనే ఉన్నాయని చెప్పారు.

ఏపీ, తెలంగాణకు కేంద్ర బృందాలు!
కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రత అధికంగా నమోదవుతున్న 10 రాష్ట్రాలకు మరిన్ని బృందాలను పంపించాలని కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా నిర్ణయించింది. వైద్య నిపుణులు, సీనియర్‌ అధికారులతో కూడిన ఈ బృందాలు కరోనా వ్యాప్తి నియంత్రణ విషయంలో రాష్ట్రాలకు సహకరిస్తాయి. కేంద్ర బృందాలను గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పంపనున్నట్లు ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. మే 3వ తేదీన 20 బృందాలను కరోనా ప్రభావం ఉధృతంగా ఉన్న 20 జిల్లాలకు పంపించినట్లు గుర్తుచేసింది.

► లాక్‌డౌన్‌ కారణంగా అబూధబీ, దుబా య్‌లలో చిక్కుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాల్లో ఈ నెల 7న కేరళకు చేరుకున్న 363 మందిలో ఇద్దరికి కోవిడ్‌–19 పాజిటివ్‌ అని పరీక్షల్లో తేలింది.

► సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్‌ వంటి కేంద్ర బల గాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువైంది. శనివారం కొత్తగా 116 మంది జవాన్లు కరోనా బారినపడ్డారు. దీంతో కేంద్ర పారా మిలటరీ దళాల్లో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 650కి చేరిందని అధికార వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు