డాక్ట‌ర్ల కోసం ప్ర‌త్యేక క్వారంటైన్ హాస్పిట‌ల్‌

30 Mar, 2020 18:03 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : క‌రోనా బాధితులకు నిర్విరామంగా కృషిచేస్తున్న డాక్ట‌ర్ల ఆరోగ్యం దృష్ట్యా కేజ్రివాల్ ప్ర‌భుత్వం ప‌లు కీల‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఢిల్లీలోని లోక్‌నాయ‌క్‌, జీబీ పంత్ ఆసుప‌త్రుల‌లో ప‌నిచేస్తున్న వైద్యుల‌ను ల‌లిత్ హోట‌ల్‌లో ఉంచ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం సోమవారం ప్ర‌క‌టించింది. క‌రోనా వైర‌స్ వేగంగా ప్ర‌బలుతున్న నేప‌థ్యంలో విధుల్లో ఉన్న వైద్య‌నిపుణులు, ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌ను 14 రోజుల‌పాటు ల‌లిత్ హోట‌ల్‌లోనే ఉంచాల‌ని నిర్ణ‌యించింది. ప్రాణాంత‌క ఈ వైర‌స్ డాక్ట‌ర్లు, వారి కుటుంబాల‌కు కూడా సోకుతున్న నేప‌థ్యంలో స‌ర్కార్ ఈ ప్ర‌ణాళిక ద్వారా క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌వచ్చ‌ని తెలిపింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఢిల్లీ ప్ర‌భుత్వం సోమ‌వారం ట్వీట్ చేసింది.

పాఠ‌శాల‌ల‌నే షెల్ట‌ర్లుగా
కోవిడ్ -19 సంక్షోభం నేపథ్యంలో ప్ర‌తిరోజు దాదాపు 4 లక్షల మందికి ఉచిత ఆహారం అందివ్వ‌డానికి 800కి పైగా ప్ర‌త్యేక కేంద్రాలు,72 లక్షల మందికి ఉచిత రేషన్ అందివ్వ‌డానికి వెయ్యికి పైగా షాపులు ప‌నిచేస్తాయ‌ని వెల్ల‌డించింది. నిరాశ్ర‌యులు, వ‌ల‌స కార్మికుల‌ కోసం ఢిల్లీ అంత‌టా 234 నైట్ షెల్ట‌ర్లు అందుబాటులో ఉన్నాయ‌ని తెలిపింది. అంతేకాకుండా రోజూవారీ కార్మికులు, వ‌ల‌స కూలీలకు వ‌స‌తి క‌ల్పించేందుకు పాఠ‌శాల‌ల‌ను షెల్ట‌ర్లుగా మార్చాల‌ని యోచిస్తుంది.

న‌గ‌రం విడిచి వెళ్ల‌కండి
వ‌ల‌స కార్మికులు ఎవ‌రూ న‌గ‌రం విడిచి వెళ్ల‌కూడ‌ద‌ని, దీని ద్వారా 21 రోజుల లాక్‌డౌన్ ప్ర‌యోజ‌నాన్ని కోల్పోతామ‌ని కేజ్రివాల్ తెలిపారు. కాబ‌ట్టి ఎక్క‌డివారు అక్క‌డే ఉండాల‌ని ముఖ్య‌మంత్రి కేజ్రివాల్ వ‌ల‌స కార్మికుల‌ను  కోరారు. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ఉన్న నేప‌థ్యంలో ఫ్యాక్ట‌రీ య‌జ‌మానులు కార్మికుల‌కు ఆహార స‌దుపాయం క‌ల్పించాల‌ని కోరారు. (ఆ వదంతులు అవాస్తవం: కేంద్రం)

అద్దె డ‌బ్బులు నేను చెల్లిస్తా: కేజ్రివాల్
అదే విధంగా ఈ విప‌త్క‌ర స‌మ‌యంలో నెల‌వారి అద్దె చెల్లించాల‌ని అద్దెదారుల‌ను య‌జ‌మానులు ఇబ్బంది పెట్ట‌కూడ‌ద‌ని కోరారు. ఒక‌వేళ అద్దె చెల్లించ‌లేని నిరుపేద‌లు ఉంటే వారిని ఎట్టి ప‌రిస్థితుల్లో ఇబ్బంది పెట్ట‌రాద‌ని, ఆ డ‌బ్బులు తానే ఇస్తాన‌ని కేజ్రివాల్ హామీయిచ్చారు. (త‌మిళ‌నాడులో ఒక్క‌రోజే 17 కొత్త కేసులు)

మరిన్ని వార్తలు