అసలు ‘గ్రీన్‌ క్రాకర్స్‌’ అంటే ఏంటి?

26 Oct, 2019 14:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు వ్యవసాయరంగంలో ‘గ్రీన్‌ రెవెల్యూషన్‌’  రాగా, ఇప్పుడు దీపావళి క్రాకర్స్‌ (బాణాసంచా) పరిశ్రమలో ‘గ్రీన్‌ రెవెల్యూషన్‌’ వస్తోంది. వ్యవసాయ రంగంలో అధిక దిగుబడిని తీసుకరావడం కోసం తీసుకొచ్చిన గ్రీన్‌ రెవెల్యూషన్‌ను తెలుగులో హరిత విప్తవంగా పేర్కొన్నారు. బాణాసంచాను కాల్చడం వల్ల వాతావరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు క్రాకర్స్‌లో వస్తోన్న ఈ గ్రీన్‌ రెవెల్యూషన్‌ను తెలుగులో కాలుష్య నియంత్రణ విప్లవంగా పేర్కొనవచ్చు. పలు భాషలు మాట్లాడే ప్రజలందరికి సులభంగా అర్థమయ్యేలా ‘గ్రీన్‌ క్రాకర్స్‌’ అని వ్యవహరిస్తున్నారు. 

ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో సాధారణ బాణాసంచా అమ్మకాలు, కొనుగోళ్లను సుప్రీం కోర్టు 2018, అక్టోబర్‌ నెలలో నిషేధించింది. సాధారణ బాణాసంచాను ముందే కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నామని, ఇంత త్వరగా ‘గ్రీన్‌ క్రాకర్స్‌’ అందుబాటులోకి రావడం కష్టమంటూ నాడు దుకాణదారులు లబోదిబోమంటూ మొత్తుకోగా, సుప్రీం కోర్టు షరతులతో కూడిన మినహాయింపులు ఇచ్చింది. ఈ ఏడాది నుంచి మాత్రం సాధారణ బాణాసంచాను అమ్మరాదని, గ్రీన్‌ కాకర్స్‌ను మాత్రమే అమ్మాలని నిక్కచ్చిగా చెప్పింది. అలాగే గ్రీన్‌ క్రాకర్స్‌ ఫార్ములాను రూపొందించాల్సిందిగా ఢిల్లీలోని ‘నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ రీసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌’ను సుప్రీం కోర్టు ఆదేశించింది. 

గ్రీన్‌ క్రాకర్స్‌లో ఉపయోగించే పదార్థాలు
సాధారణ క్రాకర్స్‌ అన్నింటిలో ‘బేరియం నైట్రేట్‌’ను ఉపయోగిస్తారు. ఇది అత్యంత హానికరమైన పదార్థం. ప్రజల శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీనికి బదులుగా వాతావరణంలోకి ధూళి, ద్రవ కణాలను వదలని లేదా అణచివేసే పదార్థాలతో గ్రీన్‌ క్రాకర్స్‌ను తయారు చేయాలని భావించి ఈ ఇంజనీరింగ్‌ సంస్థ ఓ ఫార్మూలాను రూపొందించింది. ఇందులో ఉపయోగించే పదార్థాల మిశ్రమాన్ని ‘జియోలైట్‌’ అంటారని సంస్థలో చీఫ్‌ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న సాధన రాయులు తెలిపారు. ఎక్కువ ఆక్సిజన్‌ కలిగిన ఈ పదార్థంతో తయారు చేసే గ్రీన్‌ క్రాకర్స్‌ను కాల్చినప్పుడు అందులోని ఇంధనం వేడి లేదా వెలుతురు రూపంలో బయటకు వెలువడుతుందని ఆమె తెలిపారు. వీటి వల్ల ఎలాంటి విష వాయువులు వెలువడం కనుక సాధారణ క్రాకర్స్‌తో పోలిస్తే 70 శాతం తక్కువ హానికరం అని ఆమె చెప్పారు.
 
ఇవెన్ని రకాలు ?
కొత్తగా తయారు చేస్తోన్న గ్రీన్‌ క్రాకర్స్‌లో ‘సేఫ్‌ వాటర్‌ రిలీజర్, సేఫ్‌ మినిమల్‌ అల్యూమినియం క్రాకర్, సేఫ్‌ థర్మైట్‌ క్రాకర్‌’ రకాలు ఉన్నాయి. సేఫ్‌ వాటర్‌ రిలీజర్‌ క్రాకర్స్‌ను కాల్చినప్పుడు అందులో నుంచి నీరు విడుదలై గాలి, దూళి కణాలు వాతావరణంలో కలువకుండా అడ్డుకుంటుంది. సేఫ్‌ అల్యూమినియం క్రాకర్‌లో అల్యూమినియం అతి తక్కువగా ఉంటుంది. సేఫ్‌ థర్మైట్‌ క్రాకర్‌లో వేడిని ఉత్పత్తి చేసే ఐరన్‌ ఆక్సైడ్‌ లాంటి ఖనిజ లోహాలను, తక్కువ స్థాయిలో అల్యూమినియంను ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా సాధారణ క్రాకర్స్‌ కన్నా 70 శాతం తక్కువ, అంటే 30 శాతం కాలుష్యాన్ని మాత్రమే విడుదల చేస్తాయి. నూటికి నూరు శాతం కాలుష్యం ఉండొద్దనుకుంటే ఏ క్రాకర్స్‌ను కాల్చకపోవడమే ఉత్తమం. 

గ్రీన్‌ క్రాకర్స్‌కు లైసెన్స్‌లు ఎలా?
వీటిని ఉత్పత్తి చేయాలనుకునే వారు ముందుగా ఢిల్లీలోని ‘నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ ఇనిస్టిట్యూట్‌’ను సంప్రదించి ‘అవగాహన ఒప్పందం’ కుదుర్చుకోవాలి. ఫార్ములాను తీసుకోవాలి. ఆ తర్వాత ‘పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌’ ఆమోదంతో పరిశ్రమ లైసెన్స్‌ తీసుకోవాలి. ఇప్పటి వరకు ఇంజినీరింగ్‌ సంస్థతో ఉత్పత్తిదారులు 230 అవగాహన ఒప్పందాలు, 135 ‘నాన్‌ డిస్‌క్లోజివ్‌’ ఒప్పందాలు తీసుకోగా పెట్రోలియం అండ్‌ ఎక్స్‌పోజివ్స్‌ సంస్థ నుంచి కేవలం 28 మంది మాత్రమే ఆమోదం తీసుకున్నారు. వీరిలో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా పరిశ్రమలు స్థాపించి ‘గ్రీన్‌ కాకర్స్‌’ తయారు చేస్తున్నారు. రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఈ పరిశ్రమలు ప్రస్తుతం వెలిశాయి. 

ఢిల్లీలో పరిస్థితి ఏమిటీ ?
ఢిల్లీలో బాణాసంచా లేదా టపాకాయల దుకాణదారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా మంది కస్టమర్స్‌ నిషేధించిన క్రాకర్స్‌ కావాలని కోరుతున్నారని, లేదంటే తిరిగి పోతున్నారని వాపోతున్నారు. వారు వెయ్యి రూపాయలు ఖర్చయినా ఫర్వాలేదనుకొని ఢిల్లీకి దూరంగా వెళ్లి క్రాకర్స్‌ కొనుగోలు చేస్తున్నారని, వారు వాటిని తెచ్చి ఢిల్లీ వీధుల్లో కాలిస్తే ఇక ఫలితమేమిటని ప్రశ్నిస్తున్నారు. గ్రీన్‌ క్రాకర్స్‌కు డిమాండ్‌ బాగా పెరిగిందని, కంపెనీల నుంచి సకాలంలో సరఫరా అందక ఇబ్బంది పడుతున్నామని మరో ప్రాంతంలోని దుకాణదారులు వాపోతున్నారు. 

మరిన్ని వార్తలు