గంగా నది పరిరక్షణకు రూ. 2,037 కోట్లు

11 Jul, 2014 02:18 IST|Sakshi
గంగా నది పరిరక్షణకు రూ. 2,037 కోట్లు

న్యూఢిల్లీ: గంగా నది పరిరక్షణకు ఓ సమీకృత పథకాన్ని కేంద్ర ప్రభుత ్వం ప్రకటించింది. ఇందుకు బడ్జెట్‌లో రూ. 2,037 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు భారీగా నిధులు వెచ్చించినప్పటికీ గంగా నది పరిరక్షణ కార్యక్రమం ముందుకు సాగడం లేదని, ఇందుకు తగిన కృషి జరగకపోవడమే కారణమని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అభిప్రాయపడ్డారు. అందుకే ‘నమామి గంగా’ పేరుతో గంగా కన్సర్వేషన్ మిషన్‌ను చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే గంగా పరిరక్షణకు ఉత్సాహం చూపుతున్న ఎన్‌ఆర్‌ఐలను ప్రోత్సహించేందుకు ‘ఎన్‌ఆర్‌ఐ ఫండ్ ఫర్ గంగా’ పేరుతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇక కేదార్‌నాథ్, హరిద్వార్, కాన్పూర్, వారణాసి, అలహాబాద్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లోని నదీ తీరాల అభివృద్ధి, అక్కడి పవిత్ర ఘాట్‌ల సుందరీకరణ కోసం రూ. వంద కోట్లు కేటాయించారు. వాటిలో చారిత్రక వారసత్వం ఇమిడి ఉందని ఈ సందర్భంగా జైట్లీ వ్యాఖ్యానించారు. అలాగే గంగా నదిని జల రవాణాకు అనువుగా అభివృద్ధి పరచనున్నట్లు ప్రకటించారు.

కార్గో రవాణాకు వీలుగా మార్చేందుకు రూ. 4,200 కోట్లు కేటాయించారు. దీంతో ‘జల్ మార్గ్ వికాస్’ పేరిట తొలి దశలో అలహాబాద్-హల్దియా(1620 కిలోమీటర్లు) మధ్య 1500 టన్నుల బరువైన నౌకలు ప్రయాణించేలా జల మార్గం ఆరేళ్లలో అందుబాటులోకి రానుంది. మరోవైపు నదుల అనుసంధానం ద్వారా జల వనరులను సద్వినియోగం చేసుకునే దిశగా ప్రాజెక్టును రూపొందిండంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందుకోసం సత్వరమే సమగ్ర నివేదికను రూపొందించడానికి వీలుగా బడ్జెట్‌లో రూ. వంద కోట్లు కేటాయించింది.
 
 4.
 

మరిన్ని వార్తలు