రైతులకు 2 లక్షల కోట్లు

15 May, 2020 03:39 IST|Sakshi

కిసాన్‌ క్రెడిట్‌కార్డ్‌ల ద్వారా రాయితీపై రుణం

వీధి వ్యాపారులకు రూ. 10 వేల పెట్టుబడి రుణసాయం

వలస కూలీలకు రెండు నెలల పాటు ఉచిత ఆహార ధాన్యాలు

3.16 లక్షల కోట్ల ప్యాకేజ్‌ వివరాలను వెల్లడించిన ఆర్థికమంత్రి నిర్మల

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజ్‌లో భాగంగా రెండో రోజు రూ. 3.16 కోట్ల ప్యాకేజీని గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇందులో వలస కూలీలకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, రైతులకు రాయితీపై రుణ సదుపాయం, వీధి వ్యాపారులకు పెట్టుబడి.. మొదలైనవి ఉన్నాయి. స్వస్థలాల్లో లేని వలస కూలీలకు రానున్న రెండు నెలల పాటు నెలకు ఒక్కొక్కరికి 5 కేజీల ఆహార ధాన్యాలను, కుటుంబానికి 1 కేజీ పప్పు ధాన్యాలను ఉచితంగా అందిస్తామన్నారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ, లేదా రాష్ట్ర ప్రభుత్వ రేషన్‌ కార్డు లేని సుమారు 8 కోట్ల మంది వలస కూలీలు ప్రయోజనం పొందనున్నారు. దీనికోసం దాదాపు రూ. 3500 కోట్లను ఖర్చు చేయనున్నట్లు నిర్మల చెప్పారు. ఈ మొత్తాన్ని కేంద్రమే భరిస్తుంది.

రైతుల కోసం..
రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ల ద్వారా రూ. 2 లక్షల కోట్లను రాయితీపై రుణంగా అందిస్తామన్నారు. ఈ నిర్ణయంతో దాదాపు 2.5 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారన్నారు. పీఎం–కిసాన్‌ లబ్ధిదారులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా రాయితీపై రుణాలందించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపడ్తామన్నారు. మత్స్యకారులు, పశుసంవర్థక రంగంలోని రైతులు ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చన్నారు.

, జూన్‌లో రైతులకు రబీ అనంతర, ప్రస్తుత ఖరీఫ్‌ అవసరాల కోసం నాబార్డ్‌ ద్వారా గ్రామీణ సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు రూ. 30 వేల కోట్లు అందుబాటులోకితెస్తారు. గృహ నిర్మాణరంగానికి ఊతమిచ్చేందుకు రూ. 70 వేల కోట్లను ఆమె ప్రకటించారు. రూ. 6–18 లక్షల వార్షిక ఆదాయ వర్గాల వారికి ఇళ్ల కొనుగోలుకు సబ్సీడీ రుణ సదుపాయాన్ని ఏడాదిపెంచారు. ప్రభుత్వ నిధులతో నగరాల్లో నిర్మితమైన గృహ సముదాయాల్లో వలస కార్మికులు, పేదలు తక్కువ అద్దెతో ఉపయోగించుకునేలా ‘అఫర్డబుల్‌ రెంటల్‌ హౌజింగ్‌ కాంప్లెక్స్‌’లను ఏర్పాటు చేస్తామన్నారు.

వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌ కార్డ్‌
వలస కూలీలు దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా అక్కడి రేషన్‌ షాపుల్లో తమ రేషన్‌ను పొందేందుకు ‘వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌ కార్డ్‌’ వీలు కల్పిస్తుందన్నారు. ఈ అంతర్రాష్ట్ర రేషన్‌ కార్డ్‌ పోర్టబిలిటీ దేశవ్యాప్తంగా మార్చి 2021 నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. వలస కార్మికుల పరిస్థితిపై తమ ప్రభుత్వం ఆందోళన చెందుతోందన్న నిర్మల.. ఇప్పటికీ తలపై తమ వస్తువులు మోసుకుంటూ, చిన్న పిల్లలతో పాటు హైవేలపై నడుచుకుంటూ వెళ్తున్న వలస కార్మికులు కనిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

‘జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద కానీ, రాష్ట్రాల రేషన్‌ కార్డు ద్వారా కానీ లబ్ధి పొందనటువంటి వారికి.. ఒక్కో వ్యక్తికి 5 కేజీల ఆహార ధాన్యం, ఒక్కో కుటుంబానికి కేజీ శనగపప్పు చొప్పున రెండు నెలల పాటు ఉచితంగా అందిస్తాం’ అని నిర్మల వివరించారు.  ప్రధానమంత్రి గరీబ్‌ అన్న యోజన కింద ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్‌ కార్డు ఉన్నవారికి జూన్‌ వరకు మూడు నెలల పాటు ఒక్కొక్కరికి 5 కేజీల ఆహార ధాన్యం, కుటుంబానికి కేజీ పప్పుధాన్యం ఉచితంగా ఇస్తున్నారు. దీని ద్వారా దాదాపు 80 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు.

స్వస్థలాలకు నడిచి వెళ్తున్న వారి కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నాయన్నారు. ఇందుకోసం రాష్ట్రాలు సబ్సిడీ ధరలకు కేంద్రం నుంచి ఆహార ధాన్యాలను కొనుగోలు చేసుకోవచ్చన్నారు. ఇందుకు రుణసదుపాయం కూడా ఉందన్నారు. వలస కార్మికులకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలు, ఇతర దాతృత్వ సంస్థలు కేజీకి రూ. 24 చొప్పున గోధుమలు, కేజీకి రూ. 22 చొప్పున బియ్యాన్ని సబ్సిడీ ధరకు కేంద్రం నుంచి కొనుగోలు చేయవచ్చన్నారు. భారీ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా బుధవారం రూ. 5.94 లక్షల కోట్ల ప్రయోజనాలను ఆర్థిక మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే.   

వీధి వ్యాపారులకు..
లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులకు, వారు మళ్లీ తమ వ్యాపారాలను ప్రారంభించుకునేలా ఒక్కొక్కరికి రూ. 10 వేలను పెట్టుబడి రుణంగా అందిస్తామని నిర్మల తెలిపారు. ఈ భారం ప్రభుత్వంపై సుమారు రూ. 5వేల కోట్ల వరకు ఉండొచ్చన్నారు. ముద్ర–శిశు రుణ పథకం కింద రూ. 50 వేల వరకు అప్పు తీసుకున్న చిన్నతరహా వ్యాపారులకు 2% వడ్డీ రాయితీ కల్పించాలని కూడా నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు. క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లిస్తున్నవారికి ఈ వడ్డీ రాయితీ 12 నెలల పాటు కొనసాగుతుందన్నారు. దీనితో ప్రభుత్వంపై రూ. 1500 కోట్ల భారం పడుతుందన్నారు. కాంపా(కంపెన్సేటరీ అఫారెస్టేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌ అథారిటీ) నిధుల్లో ఉపాధి అవకాశాల కోసం రూ. 6 వేల కోట్లను కేటాయిస్తున్నామన్నారు. అడవుల విస్తీర్ణం పెంచే దిశగా మొక్కలు నాటేందుకు, అటవీ పరిరక్షణ కార్యక్రమాలకు స్థానికులకు ఉపాధి లభించేలా ఈ నిధులను రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చన్నారు.

రైతులు, కార్మికులకు ప్రయోజనకరం: ప్రధాని మోదీ
కేంద్రం రెండో విడత ప్రకటించిన ప్రోత్సాహకాలు రైతులు, వలస కార్మికులకు ఎంతగానో ఉపయోగపడతాయి. సహాయక చర్యలు ముఖ్యంగా మన రైతులు, వలస కార్మికులకు తోడ్పడతాయి. అందరికీ ఆహార భద్రతతోపాటు, చిరు వ్యాపారులు, రైతులకు రుణాలు అందుతాయి.

జుమ్లా ప్యాకేజీ: కాంగ్రెస్‌.. సీతారామన్‌ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ అంతా వట్టిదే. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి జీడీపీలో 10 శాతం, రూ.40 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ ప్రధాని ఘనంగా చేసిన ప్రకటనకు ఈ ప్యాకేజీకి సంబంధం లేదు. రోడ్ల వెంట సొంతూళ్లకు నడిచి వస్తున్న వలస కార్మికుల కోసం సాయం ప్రకటిస్తారని ఎదురుచూశాం. నిరాశే మిగిలింది.

పేదల పట్ల పరిహాసం ఈ ప్యాకేజీ: సీపీఎం
ఆర్థికమంత్రి ప్రకటించిన ప్యాకేజీ రాజకీయ ఎత్తుగడ. దేశాన్ని పట్టిపీడిస్తున్న ఏ ఒక్క సమస్యకూ దీనితో పరిష్కారం లభించదు. వలస కార్మికులను కనీసం సొంతూళ్లకు కూడా చేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించలేదు. ఉద్యోగాలు కోల్పోయిన పేదలకు రూ.7,500 కోట్లు సాయం అందించాలి.

ఆ గణాంకాలతో ఏమీ ఒరగదు: సీపీఐ
ప్రోత్సాహకాలంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెబుతున్న గణాంకాలు అర్థం లేనివి. తికమక లెక్కలు. రాజకీయ ప్రయోజనాలు తప్ప ఏమీలేదు. వేలాది మైళ్లు రోడ్ల వెంట నడిచి వెళ్తున్న వలస కార్మికుల సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపలేదు. పట్టణ నిరుద్యోగం అంశాన్ని ఆమె పట్టించుకోలేదు.

మరిన్ని వార్తలు