రూ.7 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఫలితమేదీ!

14 Jul, 2017 00:51 IST|Sakshi
రూ.7 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఫలితమేదీ!

గంగా నది ప్రక్షాళనపై ప్రభుత్వాన్ని ఆక్షేపించిన గ్రీన్‌ ట్రిబ్యునల్‌
న్యూఢిల్లీ: కలుషితమవుతున్న గంగా నది ప్రక్షాళనకు రెండేళ్లలో రూ.7 వేల కోట్లు ఖర్చు పెట్టినా పర్యావరణ సమస్య నేటికీ తీవ్రంగానే ఉందని జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. నదిని పరిరక్షించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. హరిద్వార్‌– ఉన్నావోల మధ్య గంగా నది తీరం నుంచి 100మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలూ చేపట్టరాదంది.

ఈ ప్రాంతాన్ని ‘అభివృద్ధి రహిత ప్రాంతం’(నో డెవలప్‌మెంట్‌ జోన్‌)గా ప్రకటించింది. నదికి 500 మీటర్ల పరిధిలో వ్యర్థాలను డంప్‌ చేయరాదని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా నదిలో చెత్త డంప్‌ చేసినవారు పర్యావరణ పరిహారం కింద రూ.50 వేల జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ఎన్‌జీటీ చైర్మన్‌ జస్టిస్‌ స్వతంతర్‌కుమార్‌ నేతృత్వం లోని ప్రత్యేక బెంచ్‌ ఉత్తర్వులిచ్చింది. నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగా (ఎన్‌ఎం జీసీ) కింద చేపట్టిన ప్రక్షాళన పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని సూచించింది. ఈ మేరకు 543 పేజీల ఉత్తర్వుల్లో మార్గదర్శకాలను ఎన్‌జీటీ సూచించింది.

మరిన్ని వార్తలు