సాహిత్య అకాడమీ ఫెలోగా సినారె

10 Mar, 2015 03:36 IST|Sakshi
న్యూఢిల్లీ: ప్రముఖ కవి, రచయిత డా. సి. నారాయణరెడ్డి(సినారె)కి కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోగా అరుదైన గౌరవం లభించింది. దేశంలోని లబ్ధప్రతిష్టులైన రచయితలకు అత్యున్నతమైన ఫెలో పురస్కారాన్ని సాహిత్య అకాడమీ ప్రకటిస్తుంది. 1970లో విశ్వనాథ సత్యనారాయణకు, 1999లో గుంటూరు శేషేంద్రశర్మకు, 2004లో భద్రిరాజు కృష్ణమూర్తికి ఈ గుర్తింపు లభించింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత సినారె పేరును సోమవారం సాహిత్య అకాడమీ ప్రకటించింది. ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమార్తె ఆర్. శాంతకుమారికి అనువాద పురస్కారాన్ని ప్రకటించింది.
 
హిందీ ర చయిత ప్రేమ్‌చంద్ ఆత్మకథను ఆమె తెలుగులోకి అనువదించారు. కాగా, ఢిల్లీలోని కమానీ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రముఖ రచయిత రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. రాచపాలెం రచించిన ‘మన నవలలు-మన కథానికలు’ అనే విమర్శనాత్మక నవలకుగాను ఈ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. సాహిత్య అకాడమీ చైర్మన్ విశ్వనాథ్ తివారీ చేతులమీదుగా ఆయన ఈ అవార్డును తీసుకున్నారు. 
మరిన్ని వార్తలు