'పూరి గుడిసెలో పుట్టాను.. నేడు రాష్ట్రపతిగా..'

25 Jul, 2017 13:43 IST|Sakshi
'పూరి గుడిసెలో పుట్టాను.. నేడు రాష్ట్రపతిగా..'

న్యూఢిల్లీ: తానొక కుగ్రామంలో, పూరిగుడిసెలో మట్టి ఇంట్లో పుట్టానని భారత రాష్ట్రపతిగా ప్రమాణం చేసిన రామ్‌ నాథ్‌ కోవింద్‌ అన్నారు. ఇలాంటి తనకు రాష్ట్రపతిగా గొప్ప గౌరవం లభించిందని చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం 12.30గంటల ప్రాంతంలో రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఖేహర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో తొలిసారి కోవింద్‌ ప్రసంగించారు.

'పూర్తి వినమ్రంగా నేను ఈ బాధ్యత స్వీకరిస్తున్నాను. ఈ బాధ్యతను గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. రాష్ట్రపతిగా నన్ను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు. ఒక కుగ్రామంలో పూరిగుడిసెలో నేను పుట్టి పెరిగాను. అలాంటి నాకు రాష్ట్రపతిగా గొప్ప గౌరవం లభించింది. ఎంతోమంది స్ఫూర్తితో బాధ్యతలు స్వీకరిస్తున్న నేను వాటిని వినమ్రంగా నిర్వహిస్తాను. ఇప్పటి వరకు రాష్ట్రపతులుగా పనిచేసిన వారి బాటలోనే నడుస్తాను. మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌, రాజేంద్రప్రసాద్‌, అబ్దుల్‌ కలాం, ప్రణబ్‌ ముఖర్జీ అడుగుజాడల్లో ముందుకెళతాను. 125కోట్ల మంది ప్రజలు నాపైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతా. మన దగ్గర భిన్న సంస్కృతులు, భిన్న భాషలు ఉన్నాయి.. అయినా మనం భారతీయులమే.

సైనికులు, శాస్త్రవేత్తలు, పోలీసులు, రైతులూ, మహిళలు, యువతే ఈ దేశ నిర్మాతలు. భారత్‌ ఎన్నో మైలు రాళ్లు అధిగమించింది. ఇంకా ఎన్నో చేరుకోవాలి. వేలాదిమంది పోరాటం ఫలితంగా మనకు స్వాతంత్ర్యం వచ్చింది. గాంధీజీ కలలుగన్న నవసమాజాన్ని మనం నిర్మించాలి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ జాతి నిర్మాతలే. ఈ సందర్భంగా భారత్‌ నాలుగో పారిశ్రామిక విప్లవానికి స్వాగతం  పలుకుతోంది..' అంటూ ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి హోదాలో ఆయన తొలి ట్వీట్‌ కూడా చేశారు. 'భారతదేశ 14వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. నా బాధ్యతలన్నీ కూడా వినమ్రంగా నిర్వహిస్తాను' అంటూ ఆయన తొలి ట్వీట్‌ చేశారు.

 

మరిన్ని వార్తలు