ఫీజుల పెంపుపై పునరాలోచించండి

18 Apr, 2020 03:22 IST|Sakshi

 ప్రైవేట్‌ పాఠశాలలకు కేంద్ర మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ సూచన

న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రైవేట్‌ స్కూళ్లు తమ వార్షిక ఫీజుల పెంపుపై, మూడు నెలలకోసారి ఫీజులు వసూలు చేయడంపై పునరాలోచన చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ శుక్రవారం కోరారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఫీజుల పెంపుపై తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కొన్ని రాష్ట్రాలు పాఠశాల ఫీజుల పెంపుపై ఇప్పటికే కొన్ని సానుకూల చర్యలు చేపట్టాయనీ, ఇతరులు కూడా ఇదే మార్గం అనుసరిస్తారని ఆశిస్తున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కరోనా పోరాటంలో అన్ని పాఠశాలలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇలా ఉండగా.. లాక్‌డౌన్‌ సమయంలో అనుమతి లేకుండా ప్రైవేట్‌ స్కూళ్లు ఫీజులు పెంచరాదని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లు మళ్లీ తెరుచుకునేంత వరకూ ట్యూషన్‌ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా చెప్పారు. ఫీజులు చెల్లించాలంటూ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావొద్దని రాజస్తాన్, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలు ఆదేశించాయి. 
 
అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోండి: సీబీఎస్‌ఈ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉపాధ్యాయుల వేతనాలు, స్కూలు ఫీజుల చెల్లింపులపై అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) శుక్రవారం కోరింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఫీజుల అంశంపై తగిన పరిష్కారం కనుగొనాలని రాష్ట్రాలను కోరినట్లు సీబీఎస్‌ఈ  కార్యదర్శి అనురాగ్‌ త్రిపాఠీ తెలిపారు.   

మరిన్ని వార్తలు