భారత్‌ ‘విజన్‌ 2020’ అట్టర్‌ ఫ్లాప్‌

3 Jan, 2020 12:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2020 సంవత్సరం నాటికల్లా వర్దమాన దేశమైన భారత్, అభివృద్ధి చెందిన దేశంగా మారడమే కాకుండా ప్రపంచంలో సూపర్‌ పవర్‌గా అవతరిస్తుందని ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఆర్థిక వేత్తలు, రాజకీయ నిపుణలు ఆశించారు, అంచనాలు వేశారు. భారత మాజీ రాష్ట్రపతి, ఇస్రో మాజీ శాస్త్రవేత్త అబ్దుల్‌ కలామ్, తోటి ప్రభుత్వ శాస్త్రవేత్త వైఎస్‌ రాజన్‌తో కలసి ఏకంగా ‘భారత్‌ 2020’లో అంటూ ఓ పుస్తకమే రాశారు. 2020లో ఆర్థికంగా చైనాను అధిగమించి అమెరికానే సవాల్‌ చేస్తామని, అప్పుడు వచ్చే దీపావళిని దేశభక్తులుగా గొప్పగా జరుపుకోవచ్చని బీజేపీ నేత సుబ్రమణియం స్వామి వ్యాఖ్యానించారు. 2020 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తన ప్రభుత్వ విధానమని 2002లో అప్పటి దేశ ప్రధాని అటల్‌ బిహారి వాజపేయి స్వాతంత్య దినోత్సవ సందేశంలో ప్రకటించారు.

వాస్తవానికి ఎంతో నిరాశ, నిస్పృహలతో భారత్‌ 2020లోకి అడుగుపెట్టింది. అభివృద్ధి ఫలాలను ఆస్వాదించాల్సిన చోట దేశవ్యాప్తంగా ఆందోళనలను చూడాల్సి వస్తోంది. ‘ఇండియా 2020 : ఏ విజన్‌ ఫర్‌ ది న్యూ మిలీనియం’ పుస్తకాన్ని కలామ్, వైఎస్‌ రాజన్‌లు 1998లో రచించారు. 2007–8 సంవత్సరం నాటికి దేశంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా వారు ఆ పుస్తకంలో పేర్కొన్నారు. 2020 నాటికి ప్రతి భారతీయుడు దారిద్య్ర రేఖకు ఎగువనే ఉంటారని కూడా ఆశించారు. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం భారత జనాభాలో ఇప్పటికీ 30 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువనే బతుకుతున్నారు. 

దారిద్య్ర నిర్మూలనుకు అంచనా వేసిన సంవత్సరం గడిచిపోయి 12 సంవత్సరాలు గడిచిపోయినా పేదరిక నిర్మూలన జరగకపోగా పెరిగింది. జీవన ప్రమాణాలు మరింతగా పడిపోయాయి. ఐక్యరాజ్యసమతి అభివృద్ధి విభాగం అంచనాల ప్రకారం 2019 మానవ అభివృద్ధి సూచికలో 189 దేశాల్లో భారత్‌ స్థానం 129 స్థానానికి పరిమితమైంది. దేశ కార్మిక శక్తిలో మహిళా భాగస్వామ్యం పెరుగుతుందని అబ్దుల్‌ కలామ్‌ అంచనా వేయగా, మహిళా భాగస్వామ్యం  2017–18 సంవత్సరంలో మున్నెన్నడు లేనివిధంగా అత్యంత దిగువకు పడిపోయింది. మహిళ కార్మిక భాగస్వామ్యం విషయంలో ప్రపచంలో భారత్‌కన్నా ఎనిమిదంటే ఎనిమిది దేశాలే వెనకబడి ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తోంది. 

2020 సంవత్సరం నాటికి భారత్‌ దిగువ–మధ్య ఆదాయంగల దేశం స్థాయి నుంచి ఎగువ– మధ్య ఆదాయ దేశంగా ఆవిర్భవిస్తుందని ప్రపంచ బ్యాంకకు కూడా తన నివేదికలో అంచనా వేసింది. భారత్‌ ఇంకా ఆ దిగువ స్థాయిలో ఉండిపోగా, పొరుగునున్న శ్రీలంగా దిగువ–మధ్య ఆదాయంగల స్థాయి నుంచి ఎగువ స్థాయికి ఎగబాకింది. 2020 నాటికి దేశంలో ఉద్యోగావకాశాలు భారీగా పెరిగి నిరుద్యోగ సమస్య పూర్తిగా తుడిచిపెట్టుకు పోతుందని కూడా అంచనా వేశారు. వారి అంచనాలకు విరుద్ధంగా 2017–2018 సంవత్సరంలో నిరుద్యోగ సమస్య గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 6.1 శాతానికి చేరుకుంది. 

భారత్‌ ప్రణాళికా సంఘం ప్రతిపాదించిన లక్ష్యాల్లో ఏ ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేరలేదు. 2020 నాటికి మహిళల్లో అక్షరాస్యతను 94 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 65 శాతం దాటలేదు. శిశు మరణాలను వెయ్యికి 22కు పరిమితం చేయాలనుకున్నారు. 2017 లెక్కల ప్రకారం అది వెయ్యికి 33 కొనసాగుతోంది. పిల్లల్లో పోషక పదార్థాల లోపాన్ని ఎనిమిది శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ప్రస్తుతం అది 32.7 శాతానికి చేరుకుంది. దేశంలో ఆటోమొబైల్‌ రంగం వృద్ధి రేటు గణనీయంగా పడిపోయింది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా జీడీపీ వృద్ధి రేటు కూడా కనిష్ట స్థాయికి పడిపోయింది. 

2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీని మరోసారి ప్రధాన మంత్రిగా ఎన్నుకుంటే 2024 నాటికల్లా భారత్‌ను సూపర్‌ పవర్‌గా మారుస్తారని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రకటించగా, అబ్దుల్‌ కలాం ‘విజన్‌ 2020’ మోదీ నెరవేరుస్తారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించడంలో భారత్‌ 20 ఏళ్లు వెనకబడిందని పలువురు ఆర్థికవేత్తలు ఇప్పుడు చెబుతున్నారు. తోటి ఆసియా దేశాలైనా బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకకన్నా భారత్‌ వెనకబడిపోయిందని ప్రముఖ భారత ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్యసేన్‌ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటప్పుడు భారత్‌ కలలు కల్లలేగదా!

మరిన్ని వార్తలు