ఆగస్టు 12 వరకు రైళ్లు బంద్‌

26 Jun, 2020 05:34 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న దృష్ట్యా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్‌ రెగ్యు లర్‌ రైళ్లతోపాటు సబర్బన్‌ రైళ్లను ఆగస్టు 12 వరకు రద్దుచేస్తున్నట్లు తెలిపింది.  గతంలో ఈ రైళ్లను జూన్‌ 30 వరకు రద్దు చేసింది. తాజా నిర్ణయంతో ఆగస్టు 12 వరకు పొడిగించినట్లయింది. కరోనా వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. మే 12వ తేదీ నుంచి రాజధాని మార్గాల్లో నడిచే 15 జతల ప్రత్యేక రైళ్లు, జూన్‌ ఒకటో తేదీ నుంచి నడుపుతున్న 100 జతల రైళ్లు మాత్రం కొనసాగుతాయని వివరించింది. రద్దయిన రైళ్లకు జూలై 1 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు చేసిన టికెట్‌ రిజర్వేషన్లకు రద్దు చేసి, ఆ సొమ్మును వాపసు చేయనున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది.  

రైల్వే స్టాళ్లలో కరోనా నిత్యావసరాలు
కరోనా నిత్యావసరాలైన మాస్క్‌లు, గ్లౌజ్‌లు, శానిటైజర్లు ఇకపై రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఉండే స్టాళ్లలో లభించనున్నాయని రైల్వే అధికారులు గురువారం తెలిపారు. ప్రస్తుతం అమ్ముతున్న పుస్తకాలు, తినుబండారాలు, మందులతో పాటు వీటిని అమ్మవచ్చని, అయితే అవి ఎమ్మార్పీ ధరను మించరాదని స్పష్టంచేశారు. ఇంటి నుంచి వచ్చేటపుడు మాస్కు, శానిటైజర్‌ మర్చిపోయేవారు వీటిలో కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. రైళ్లలో ఇచ్చే బెడ్‌రోల్‌ కిట్స్‌ ఇకపై ఉండవని, ప్రయాణికులు వాటిని స్టాల్స్‌లో కొనుక్కోవాలని తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు