ఆన్‌లైన్‌లోనే సెమిస్టర్లు

26 Jun, 2020 05:39 IST|Sakshi

ఐఐటీ–బాంబే నిర్ణయం

అదే బాటన మిగతా ఐఐటీలు?

న్యూఢిల్లీ: కోవిడ్‌ నేపథ్యంలో విద్యార్థులకు ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే సెమిస్టర్లను నిర్వహించాలని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)– బాంబే నిర్ణయించింది. విద్యాసంవత్సరం ఆలస్యం కాకుండా ఆన్‌లైన్‌ ద్వారానే తరగతులు ప్రారంభించేందుకు యత్నిస్తున్నట్లు వెల్లడించింది. దేశంలోని మిగతా ఐఐటీలు ఇదే విధానాన్ని అనుసరించే  అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఐఐటీ–బాంబే డైరెక్టర్‌ సుభాశీశ్‌ ఛౌధురి గురువారం ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ‘సంస్థ సెనేట్‌లో చర్చించాక.. వచ్చే సెమిస్టర్‌ను ఆన్‌లైన్‌లోనే చేపట్టాలని నిర్ణయించాం. విద్యార్థుల ఆరోగ్యం, రక్షణ విషయంలో రాజీ పడబోం’అని తెలిపారు.

తమ విద్యాసంస్థలో ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నందున ఆన్‌లైన్‌లో చదువుకునేందుకు అవసరమైనవి సమకూర్చుకునేందుకు వారికి దాతలు ముందుకువచ్చి, సాయం చేయాలని ఛౌధురి కోరారు. విద్యాసంవత్సరం క్యాలెండర్‌ను సమీక్షిం చేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ సంప్రదింపులు జరుపుతున్న సమయంలో ఐఐటీ–బోంబే ఈ నిర్ణయం తీసుకుంది. జూలై నుంచి డిసెంబర్‌ వరకు సాగే సెమిస్టర్‌కు మిగతా ఐఐటీలు  అనుసరించే చాన్సుంది. ఈ విషయమై ఐఐటీ–ఢిల్లీకి చెందిన ఒక అధికారి స్పందించారు. ‘విద్యాసంవత్సరాన్ని ఆలస్యం చేయడం తెలివైన పనికాదు. ఎంతకాలం క్యాంపస్‌లో విద్యార్థులు సురక్షితంగా ఉండగలరనేది మనకు తెలియదు. అందుకే, కంప్యూటర్, ఇంటర్నెట్‌ సౌకర్యం లేని విద్యార్థులు వాటిని సమకూర్చుకునేందుకు సాయపడుతూ విద్యా సంవత్సరాన్ని మొదలు పెట్టడమే మంచిది’ అని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు