జూన్ 8న కైలాస్ మానస సరోవర్ యాత్ర షురూ

31 Mar, 2014 10:43 IST|Sakshi

 డెహ్రాడూన్: ప్రతి ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక 'కైలాస్ మానససరోవరం యాత్ర' జూన్ 8న ప్రారంభంకానుంది. ఢిల్లీలో ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం యాత్రకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ధ్రువీకరణ పొందిన ప్రయాణికులను గ్రూపులుగా పంపుతారు. ఢిల్లీలోని భారత్-టిబెట్ సరిహద్దు పోలీస్ (ఐటీబీపీ) బేస్ ఆస్పత్రిలో పరీక్షించిన అనంతరం ప్రయాణికులను జూన్ 12న ఉత్తరాఖండ్కు పంపిస్తారు. ఢిల్లీలో ఉన్న సమయంలోనే ప్రయాణికులు ఫీజు, ఇతర ఖర్చులను చెల్లించాలని అధికారులు తెలిపారు. 60 మంది సభ్యులతో కూడిన 18 గ్రూపులకు విదేశీ వ్యవహరాల శాఖ అనుమతిచ్చింది. ఉత్తరాఖండ్లో కూడా ప్రయాణికులకు మరోసారి వైద్య పరీక్షలు చేస్తారు. యాత్ర ఏర్పాట్లను ఐటీబీపీ ఏడో బెటాలియన్ పర్యవేక్షిస్తుంది. వారి వెంట వైద్య బృందం కూడా ఉంటుంది. సెప్టెంబర్ 9న సరోవరం యాత్ర పూర్తవుతుంది. ఈ పర్వతాలు సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండటం వల్ల పూర్తిగా ఆరోగ్యం ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు.

 

మరిన్ని వార్తలు