కార్మికులు కనిపించారు

22 Nov, 2023 03:35 IST|Sakshi
సొరంగం లోపల చిక్కుకున్న కార్మికులు, వారు ఆహారం తీసుకుంటున్నప్పటి దృశ్యాలు  

ఎండోస్కోపీ కెమెరాతో ప్రయత్నాలు సఫలం

బయటికొచ్చిన మొట్టమొదటి విజువల్స్‌

పైప్‌లైన్‌ ద్వారా మరింత స్పష్టంగా మాట్లాడే అవకాశం

ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగం కూలిన 10వ రోజైన మంగళవారం సానుకూల పరిణామం సంభవించింది. లోపల చిక్కుకున్న 41 మంది కార్మికులతో వారి కోసం బయట వేచి ఉన్న కుటుంబసభ్యులు మరింత సులువుగా, స్పష్టంగా మాట్లాడారు. అంతేకాకుండా, లోపలున్న వారికి సంబంధించిన విజువల్స్‌ మొట్టమొదటిసారిగా బయటకు వచ్చాయి.

దీంతో, కూలిన సొరంగం శిథిలాల్లోంచి తవ్విన ఆరంగుళాల పైప్‌లైన్‌ ద్వారా ఎండోస్కోపిక్‌ కెమెరాను పంపించి, లోపలున్న వారి యోగ క్షేమాలను తెలుసుకునేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విజయవంతమైనట్లయింది. ఈ పైపును 53 మీటర్ల మేర అడ్డుపడిన శిథిలాల గుండా సోమవారం లోపలికి ప్రవేశపెట్టారు. కెమెరాను సోమ వారం రాత్రి ఢిల్లీ నుంచి అక్కడికి పంపించారు.

పసుపు, తెలుపు రంగుల హెల్మెట్లను ధరించిన కార్మికులు, పైపులైన్‌ద్వారా లోపలికి పంపించిన ఆహార పదార్థాలను ఒకరికొకరు అందించుకుంటూ, మాట్లాడుకుంటూ ఆ విజువల్స్‌లో కనిపించారు. బయటున్న అధికారులు పెద్ద స్క్రీన్‌పై వారిని చూస్తూ తగు సూచనలు ఇచ్చారు. కెమెరా లెన్స్‌ శుభ్రంగా ఉంచుతూ, తమను తాము పరిచయం చేసుకోవాలని కోరారు. పైప్‌లైన్‌ దగ్గరకు చేరుకుని లోపలికి పంపించిన వాకీటాకీలతో మాట్లాడాలని చెప్పారు. అనంతరం ఆ కెమెరాను వెనక్కి తీశారు. ఇప్పటికే కొందరి కుటుంబసభ్యులు నాలుగంగుళాల కంప్రెషర్‌ ట్యూబ్‌ ద్వారా లోపలున్న తమ వారితో మాట్లాడారు.

ఆ ట్యూబ్‌ ద్వారానే డ్రైఫ్రూట్స్‌ వంటివి కూడా లోపలికి పంపించారు. అయితే, తాజాగా అందుబాటులోకి వచ్చిన పైప్‌లైన్‌ కార్మికుల పాలిటి లైఫ్‌లైన్‌గా మారింది. ఇంతకుముందు కంటే ఎక్కువ ఆహారాన్ని పంపొచ్చు. కుటుంబసభ్యులతో మరింత సులువుగా, స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. కొత్త పైపు ద్వారా లోపలున్న వారికి నారింజ, అరటి, యాపిల్‌ పండ్లు, బాటిళ్లలో కిచిడీ, సెల్‌ఫోన్లు, చార్జెర్లను సైతం పంపించారు.

ఒక డాక్టర్‌ కూడా లోపలున్న కార్మికులతో మాట్లాడారు. వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కడుపులో మంట, మూత్ర విజర్జనలో సమస్య..తదితరాలను తెలపగా వారికి మల్టీవిటమిన్‌ ట్యాబెట్లు, ఎలక్ట్రోలైట్‌ పౌడర్, యాంటీ డిప్రెస్సెంట్‌లను పంపినట్లు డాక్టర్‌ పీఎస్‌ పొఖ్రియాల్‌ చెప్పారు. సొరంగంలో చిక్కుకుపోయిన ప్రదీప్‌ కిక్సు క్షేమంగానే ఉన్నట్లు ఆయన మరదలు తెలిపారు.

మరిన్ని వార్తలు