‘హైవే మద్యం’పై నిషేధం

1 Apr, 2017 02:58 IST|Sakshi
‘హైవే మద్యం’పై నిషేధం

నేటి నుంచే అమల్లోకి
- 500 మీటర్ల లోపున్న దుకాణాలు మూసేయాలన్న సుప్రీం కోర్టు
- తెలంగాణలో సెప్టెంబర్‌ 30, ఏపీలో జూన్‌ 30 వరకు గడువు
- సిక్కిం, హిమాచల్, మేఘాలయలకు మినహాయింపు
- తీర్పు సమీక్షించాలన్న లిక్కర్‌ అసోసియేషన్‌ వినతి తిరస్కరణ
- బిహార్‌లో మద్యం నిల్వల ఖాళీకి మే 31 తుది గడువు  


న్యూఢిల్లీ: జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలను మూసేయాలని శుక్రవారం సుప్రీం కోర్టు ఆదేశించింది. డిసెంబర్‌ 15, 2016కు ముందు లైసెన్సులు తీసుకున్న (తెలంగాణ, ఏపీతో సహా పలురాష్ట్రాలకు) వారికి మాత్రం కొంత గడువిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కేఎస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. మద్యం దుకాణాలతోపాటు బార్లు, పబ్బులు, రెస్టారెంట్లను ఏప్రిల్‌1 నుంచి మూసేయాలని స్పష్టం చేసింది. ఘోరమైన రోడ్డు ప్రమాదాలకు హైవేల పక్కన మద్యం అందుబాటులో ఉండటమే కారణమని అభిప్రాయపడింది.

అయితే.. సిక్కిం, మేఘాలయా, హిమాచల్‌ ప్రదేశ్‌లకు ‘500 మీటర్ల’ నిబంధననుంచి మినహాయింపునిచ్చింది. ఈ రాష్ట్రాల్లో హైవేలకు 220 మీటర్ల దూరంలో మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చని జస్టిస్‌ డీవై చంద్రచూడ్, ఎల్‌ నాగేశ్వరరావులతో కూడిన ఈ ధర్మాసనం ఆదేశించింది. మార్చి 31 తర్వాత హైవేలకు ఆనుకుని ఉన్న మద్యం అమ్మకాల కేంద్రాల లైసెన్సులను కొనసాగించకూడదని పేర్కొంది. డిసెంబర్‌ 15, 2016కు ముందు లైసెన్సులు పొందిన కేంద్రాలకు తెలంగాణలో సెప్టెంబర్‌ 30 వరకు, ఆంధ్రప్రదేశ్‌లో జూన్‌ 30 వరకు మాత్రమే దుకాణాలు నిర్వహించుకునేందుకు అనుమతిచ్చింది. కోర్టు తీర్పును సమీక్షించాలంటూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేరళ, పంజాబ్, తెలంగాణ మద్యం అమ్మకందారుల అసోసియేషన్ల వినతినీ, 500 మీటర్ల నిబంధన నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలన్న అటార్నీ జనరల్‌ రోహత్గీ వినతిని కోర్టుతోసిపుచ్చింది. మద్యం తాగి వాహనాలు నడపటం ద్వారా ఏటా 1.42 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారన్న పిల్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

ఉత్తరాఖండ్‌పై స్టే
ఉత్తరాఖండ్‌లోని మూడు జిల్లాల్లో పూర్తిగా మద్యపానం నిషేధించాలన్న ఆ రాష్ట్ర హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టు స్టే విధించింది. హిమాలయ పర్వతాల్లో పవిత్రమైన చార్‌ధామ్‌ యాత్ర జరిగే మూడు జిల్లాల్లో (రుద్రప్రయాగ్, చమోలీ, ఉత్తరకాశీ) మద్యం అమ్మకాలను 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి పూర్తిగా నిషేధించాలని ఉత్తరాఖండ్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ ప్రాంతాల్లో యువత ఎక్కువగా మద్యానికి బానిసలుగా మారుతున్నట్లు ఆధారాలున్నందున ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

గురుద్వారాల వద్ద పొగాకు అమ్మకాలపైనా నియంత్రణ విధించాలంది. మద్యం అమ్మకాల విషయాన్ని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కోర్టులో సవాల్‌ చేసింది. హైకోర్టు తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. బిహార్‌లో మద్యం తయారీ సంస్థలకున్న స్టాక్‌ (నిల్వలు)ను మే 31 లోగా ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు (జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌ల ధర్మాసనం) ఆదేశించింది. బిహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉన్నందున..  తయారీ, నిల్వలను నిషేధిస్తున్నట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు