అంకుల్‌.. లారీ వస్తోంది చూడండి.. అని గట్టిగా అరిచిన హాసిని

23 Nov, 2023 13:05 IST|Sakshi

విశాఖపట్నం: వేగంగా దూసుకొచ్చిన ఆటోడ్రైవర్‌ లారీని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 8 మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలవడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కంచరపాలెం, మురళీనగర్‌, 104 ఏరియా ప్రాంతాలకు చెందిన హాసిని ప్రియ (15), వాణి జయ రమ్య (13), డి.లక్ష్య (8), జి.గాయత్రి (13), మరో నలుగురు విద్యార్థులు నగరంలోని బేతనీ స్కూల్‌లో చదువుతున్నారు. వీరు అదే ప్రాంతానికి చెందిన రాజు అనే వ్యక్తి ఆటోలో మూడేళ్లుగా స్కూల్‌కు వస్తున్నారు.

ఎప్పటిలాగే బుధవారం ఉదయం ఆటోలో స్కూల్‌కు బయలుదేరారు. అయితే అప్పటికే ఆలస్యం కావడం... వీరిని పాఠశాల వద్ద దించేసి, మరికొంత మంది విద్యార్థులను వేరే స్కూల్‌కు తీసుకెళ్లాల్సి ఉండడంతో డ్రైవర్‌ రాజు ఆటోను వేగంగా నడుపుతున్నాడు. ఈ క్రమంలో వీరి ఆటో సంగం శరత్‌ థియేటర్‌ జంక్షన్‌ సమీపానికి వచ్చేసరికి, రైల్వే స్టేషన్‌ రోడ్డులో కాంప్లెక్స్‌ వైపు ఓ లారీ వస్తోంది. ఫ్లైఓవర్‌ సమీపానికి వచ్చేసరికి లారీ కనిపించడంతో ఆటోలోని హాసిని ప్రియ గమనించి... లారీ వస్తోందని గట్టిగా అరిచింది. అయినప్పటికీ ఆ లారీని దాటి ముందుకు వెళ్లిపోవాలని నిర్లక్ష్యంతో డ్రైవర్‌ రాజు ముందుకు దూసుకురాగా... అప్పటికే లారీ వచ్చేయడంతో దాన్ని ఢీకొట్టి ఆటో బోల్తాపడింది. ఒక్కసారిగా అందులోని విద్యార్థులంతా చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోవడంతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది.

ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన నలుగురికి, డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో నుజ్జునుజ్జయ్యింది. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఓ ప్రైవేట్‌ హోటల్‌ మేనేజర్‌ వెంకటరావు, స్థానిక యువకుడు శివ స్పందించి తీవ్ర గాయాలైన హాసిని ప్రియ, వాణి జయ రమ్య, డి.లక్ష్య, జి.గాయత్రిని కారులో తీసుకెళ్లి సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో హాసిని ప్రియ తలకు తీవ్ర గాయమవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి పర్యవేక్షణలో వుంచారు. మరో నలుగురు విద్యార్థులకు రైల్వే ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారు. ఆటో డ్రైవర్‌ రాజును కేజీహెచ్‌కు తరలించారు. ప్రమాద స్థలాన్ని ద్వారకా పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐలు ధర్మేంద్ర, అప్పలరాజు పరిశీలించి ఆటో, లారీని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

బాధిత విద్యార్థులకు పరామర్శ
ప్రమాదంలో గాయాలపాలైన విద్యార్థులను సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రికి వెళ్లి వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో – అర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి పరామర్శించారు. పిల్లల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. వైద్య ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని, అవసరమైన సేవలు అందించాలని వైద్యులను కోరారు. ఆయనతోపాటు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కేకే రాజు, డీసీపీ – 1 శ్రీనివాసరావు, గొండు సీతారామ్‌, సీతమ్మధార అర్బన్‌ తహసీల్దార్‌ ఎం.ఆనందకుమార్‌, డీఎంహెచ్‌వో జగదీశ్వరరావు, డీఈవో చంద్రకళ, రోడ్డు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ రాజారత్నం పరామర్శించారు.

త్రుటిలో తప్పిన ముప్పు
పీఎం పాలెం: స్కూలు పిల్లలను తీసుకెళ్లిన ఆటో బోల్తాపడడంతో మధురవాడ ప్రాంతవాసులు తీవ్ర ఆందోళన చెందారు. స్థానిక భాష్యం స్కూల్‌లో చదువుకుంటున్న పిల్లలను తీసుకుని బుధవారం ఉదయం ఆటో నగరంపాలెం రోడ్డులో వస్తుండగా ప్రమాదవశాత్తు బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు పిల్లలకు, డ్రైవర్‌కు స్వల్ప గాయలయ్యాయి. స్థానికులు అప్రమత్తమై బోల్తాపడిన ఆటోను లేవదీసి, పిల్లలకు సపర్యలు చేశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.

ఆ అమ్మాయి మాట వినుంటే...
అంకుల్‌.. లారీ వస్తోంది చూడండి.. అని గట్టిగా అరిచిన హాసిని ప్రియ మాటను డ్రైవర్‌ రాజు విని వుంటే పరిస్థితి వేరేలా వుండేదని పలువురు అంటున్నారు. లారీని గుర్తించిన వెంటనే ఆటో వేగాన్ని నియంత్రించి... తర్వాత వెళ్లి వుంటే పిల్లలంతా క్షేమంగా స్కూల్‌కు చేరుకునే వారు. తోటి విద్యార్థులతో చక్కగా చదువుకుని సాయంత్రం ఇళ్లకు చేరుకుని తల్లిదండ్రులతో ఆనందంగా గడిపేవారు. ఆ అమ్మాయి మాట వినకుండా నిర్లక్ష్యంగా ఆటోను నడిపి 8 మంది విద్యార్థుల భవిష్యత్‌ను డ్రైవర్‌ రాజు ప్రమాదంలోకి నెట్టేశాడని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు