భిన్నంగా లాక్‌డౌన్‌ 4.0

17 May, 2020 04:05 IST|Sakshi

రేపటి నుంచి నెలాఖరు వరకు కొనసాగే అవకాశం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించే లక్ష్యంగా కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌ మూడో దశ నేటితో ముగియనుంది. ఈ నెలాఖరు వరకు కొనసాగే నాలుగో దశ లాక్‌డౌన్‌ ఈసారి భిన్నంగా ఉండే అవకాశాలున్నాయని కేంద్రం సూచనలిచ్చింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలను విడుదల చేయనుంది. నాలుగో దశలో భాగంగా కంటైన్‌మెంట్‌ జోన్లలో మినహా రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్లలో ఆటోలు, రిక్షాలు, బస్సులు, క్యాబ్‌లు తిరిగేందుకు కేంద్రం అనుమతించే చాన్సుంది.

కంటైన్‌మెంట్‌ జోన్లుకాని అన్ని జిల్లాల్లో అత్యవసరేతర వస్తువుల సరఫరా, ఈ–కామర్స్‌ సంస్థలకు ఓకేచెప్పనుంది. ఆఫీస్‌లు, కర్మాగారాలను మరింత మంది సిబ్బందితో నడిపేందుకు వెసులుబాటు ఇచ్చే అవకాశాలున్నాయి. కోవిడ్‌ రెడ్‌ జోన్ల నిర్వచనాన్ని కూడా కేంద్రం మార్చనుందని సమాచారం. కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు లాక్‌డౌన్‌ సమయంలో 33 శాతం సిబ్బందితోనే ఫ్యాక్టరీలుఉత్పత్తి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అయితే, మరింత మంది సిబ్బందిని పనుల్లోకి తీసుకునే వెసులుబాటు కల్పించాలని ఆయా ఫ్యాక్టరీల యాజమాన్యాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దేశంలో జూన్, జూలై నెలల్లో మరింతగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తుండగా కేంద్రం ఆంక్షలను క్రమక్రమంగా సడలిస్తూండటం గమనార్హం.

30 మున్సిపాల్టీలు/కార్పొరేషన్లకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచన  
దేశంలో ఇప్పటిదాకా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో 80 శాతం కేసులు 30 మున్సిపాల్టీలు/కార్పొరేషన్లలోనే బయటపడినట్లు తేలడంతో కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా మున్సిపాల్టీలు/కార్పొరేషన్లు ఉన్న రాష్ట్రాల ఆరోగ్యశాఖ కార్యదర్శులు, మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా మేజిస్ట్రేట్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాల్లోనే ఈ 30 మున్సిపాల్టీలు/కార్పొరేషన్లు ఉన్నాయి. ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతీ సుదాన్, ఓఎస్‌డీ రాజేశ్‌ భూషణ్‌ మాట్లాడారు. కరోనా బాధితులను గుర్తించడంతో అధికారులు చురుగ్గా వ్యవహరించాలని, రికవరీ రేటు పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు చేపట్టిన చర్యలను సమీక్షించారు.  

పట్టణ ప్రాంతాల్లో నిఘా పెంచండి.. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి పట్టణ ప్రాంతాల్లో నిఘాను మరింత పటిష్టం చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఈ మేరకు అర్బన్‌ సెటిల్‌మెంట్లలో కరోనా నియంత్రణపై మార్గదర్శకాలను శనివారం జారీ చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని వెల్లడించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా సెక్షన్‌ 144ను అమలు చేయాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లో చాలాచోట్ల ప్రజలు విచ్చలవిడిగా సంచరిస్తున్నారని, ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ దృష్టికి రావడంతో ఈ మార్గదర్శకాలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు