పోలీసు నుంచి మంత్రికి సోకిన కరోనా

24 Apr, 2020 08:39 IST|Sakshi

వైరస్‌ బారినపడిన రాష్ట్ర మంత్రి జితేంద్ర అవద్‌

సాక్షి, ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆరువేలు దాటడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా రాష్ట్ర మంత్రి జితేంద్ర అవద్‌కు కూడా కరోనా పాజిటివ్‌ అని తేలడం కలకలం రేపుతోంది. మంత్రికి వైరస్‌ సోకినట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు ధృవీకరించారు. రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జితేంద్ర నివాసంలో విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరికి ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మంత్రితో పాటు కుటుంబ సభ్యులంతా రెండు వారాల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అనంతరం పరీక్షలు నిర్వహించగా వాందరికి కరోనా నెగిటివ్‌గా తేలింది.

దీంతో ఊపిరి పీల్చుకున్న మంత్రి జితేంద్ర అధికారులతో సమీక్ష సందర్భంగా ఓ పోలీసు అధికారితో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ఓ వారం తరువాత ఆ పోలీసు అధికారికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో మంత్రికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించగా పోలీసు నుంచి జితేంద్రకు వైరస్‌ సోకినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు మరికొంత మందిని వైద్య పరీక్షలుకు తలించారు. మంత్రికి సమీపంగా మెలిగిన వారందరినీ క్వారెంటైన్‌కు తరలిస్తున్నారు. (సీఎం పదవికి ఉద్ధవ్‌ రాజీనామా తప్పదా?)

అయితే జితేంద్రతో పాటు ఆయన సమీప బంధువులకు కూడా వైరస్‌సోకి ఉంటుందని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.  కాగా వైరస్‌ సోకిన పోలీసు అధికారి కదలికలపై కూడా అధికారులు దృష్టి సారించారు. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లిన వారిని గుర్తించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారని, మత ప్రార్థనలకు వెళ్లిన వారి ప్రాంతాల్లో ఆయన ఎ‍క్కువగా పర్యటించారని పోలీస్ట్‌ స్టేషన్‌ సిబ్బంది చెబుతోంది.

మరిన్ని వార్తలు