లైవ్‌ షోలో మహిళపై మౌలానా దాడి

18 Jul, 2018 12:53 IST|Sakshi

ట్రిపుల్‌ తలాక్‌  ఖురాన్‌కు విరుద్ధమన్న మహిళ న్యాయవాది

లైవ్‌ షోలో ఆమెపై దాడిచేసిన ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సభ్యుడు

సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్‌ తలాక్‌పై ఓ న్యూస్‌ చానెల్‌ చేపట్టిన చర్చ తీవ్ర గొడవకు దారితీసింది. ప్రత్యక్ష ప్రసారంలో విచక్షణ కోల్పోయిన ఓ ప్రతినిధి.. ఏకంగా మహిళా లాయర్‌పై చేయి చేసుకున్నాడు. ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అందరూ చూస్తుండగానే మహిళపై దాడి చేసిన సదరు ప్రతినిధిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్రిపుల్‌ తలాక్‌తో విడాకులు పొందాలనే అంశం అసలు ఖురాన్‌లో లేనేలేదని ఓ మహిళ న్యాయవాది వాదించగా.. సహనం కోల్పోయిన ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సభ్యుడు ఆమెపై దాడి చేశాడు. ట్రిపుల్‌ తలాక్‌ అంశంపై ఓ టీవీ ఛానల్‌ మంగళవారం చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. లైవ్‌గా ప్రసారమైన ఈ చర్చలో భాగంలో సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది ఫరాహ్ ఫైజ్‌ మాట్లాడుతూ.. ట్రిపుల్‌ తలాక్‌ ద్వారా విడాకులు పొందడం ఖురాన్‌లో లేదని, ట్రిపుల్‌ తలాక్‌ ఖురాన్‌కు విరుద్ధమని వ్యాఖ్యనించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మౌలానా ఇజా అర్షద్‌ ఖ్వాసి.. ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో ఖ్వాసి ఆమెపై అసభ్య పదాజాలంతో లైవ్‌ షోలోనే దాడికి దిగారు.

ఫరాహ్‌ గత కొంతకాలంగా ముస్లిం మహిళల తరఫున ట్రిపుల్‌ తలాక్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు. టీవీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు. ఎఐఎం​పీఎల్బీ సభ్యుడు మహిళ న్యాయవాదిపై దాడి చేసిన వీడియో.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు