అన్‌లాక్‌-2: విద్యా సంస్థలు, మెట్రో బంద్‌!

27 Jun, 2020 08:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19) కల్లోలంతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన విషయం విదితమే. కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో జూన్‌ 8 నుంచి దశల వారీగా కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు(అన్‌లాక్‌–1) వీలుగా కేంద్ర సర్కారు విస్తృతమైన మినహాయింపులు ఇచ్చింది. ఇక మహమ్మారి కట్టడికై విధించిన లాక్‌డౌన్‌ జూన్‌ 30తో ముగియనున్న నేపథ్యంలో అన్‌లాక్‌- 2.0కు రంగం సిద్ధమవుతోంది. అన్‌లాక్‌-1తో పోలిస్తే పెద్దగా మార్పులేమీ ఉండవని గత కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. (ఢిల్లీలో జూలై 31 వరకు స్కూళ్లు బంద్‌)

స్కూళ్లు, కాలేజీలు తెరిచే అవకాశం లేదు..
కరోనా విజృంభణ నేపథ్యంలో జూలై 15 అర్ధరాత్రి వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్ ‌(డీజీసీఏ) శుక్రవారం ప్రకటించింది. అదే విధంగా... మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో అన్ని రెగ్యులర్‌ రైళ్లను నడపడం సమీప భవిష్యత్తులో సాధ్యం కాకపోవచ్చని రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ అభిప్రాయపడ్డారు. ఇక రోజురోజుకీ దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో మెట్రో సర్వీసులను కూడా ఇప్పుడే పునరుద్ధరించే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. అలాగే.. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు సహా అన్ని విద్యా సంస్థలు ఆగస్టు రెండో వారం వరకు తెరిచే అవకాశం లేదని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోక్రియాల్‌ ఇది వరకే సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు పదో తరగతి పరీక్షలు రద్దు చేయగా... కోవిడ్‌–19 వ్యాప్తి దృష్ట్యా జూలైలో జరగాల్సిన పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) నిర్ణయం తీసుకుంది. (భారత్‌ ఎకానమీ అస్తవ్యస్తం)

అంతేగాక ఐఐటీ బాంబే వంటి ప్రఖ్యాత విద్యా సంస్థల నుంచి సాధారణ స్కూళ్ల వరకు అన్ని యాజమాన్యాలు ఆన్‌లైన్‌ క్లాసుల కొనసాగింపునకే మొగ్గు చూపుతున్నాయి. కాగా కరోనా వైరస్‌ కట్టడితో పాటు జూన్‌ 30తో లాక్‌డౌన్‌ ముగియనుండటంతో చేపట్టాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా... దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 4,90,401కి చేరగా... 15,301 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు.  

మరిన్ని వార్తలు