అమ్మాయి పుడితే పండుగే

3 Jul, 2014 12:10 IST|Sakshi
అమ్మాయి పుడితే పండుగే

పుణే : హదాప్సర్ ప్రాంతంలో అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా సందడిగా మారింది. ఓ వ్యక్తి స్టీలు ప్లేటుపై కర్రతో గట్టిగా బాదుతూ శబ్దం చేస్తున్నాడు. ఇంతలో ఇక్కడి ఆస్పత్రికి చెందిన వార్డు బాయ్‌లు, నర్సులు చేతుల్లో మిఠాయిలు పట్టుకొని దారిన వచ్చేపోయే వారికి పంచడం ప్రారంభించారు.

ఈ హడావుడి అంతా ఓ ఆడపిల్ల జన్మించినందుకు ఇక్కడి మెడికేర్ ఆస్పత్రి సిబ్బంది చేసిన సందడి. మెడికేర్ ఆస్పత్రి అమలు చేస్తున్న విప్లవాత్మక విధానం ఇక్కడివారికి సుపరిచితమే. డాక్టర్ గణేష్ రఖ్ స్థాపించిన ఈ ఆస్పత్రిలో ఆడపిల్ల పుడితే ఉచితంగా ప్రసూతి సేవలు అందిస్తారు. ప్రసవం సాధారణమైనా, లేక శస్త్ర చికిత్స అవసరమైనా సరే 2007 నుంచి ఉచితంగా సేవలు అందిస్తున్నారు. ఇంతవరకు తమ ఆస్పత్రిలో 270 మంది ఆడపిల్లలు పుట్టారని గణేష్ రఖ్ గర్వంగా చెప్పారు.  భ్రూణ హత్యలను నివారించేందుకు తాము చేపట్టిన ఒంటరి ప్రచారమని రఖ్ చెప్పారు.
 
జన్మించినప్పటి నుంచే లింగ వివక్షపై పోరాడే విధంగా మహిళలకు సాధికారత కల్పించాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. సాధారణ ప్రసవానికి రూ.10 వేలు, శస్త్రచికిత్స అవసరమైన క్లిష్టతరమైన ప్రసవానికి రూ.25వేల చొప్పున నష్టాలు వస్తున్నప్పటికీ తాము ఉచితంగానే సేవలు కొనసాగిస్తున్నామని అన్నారు. కొన్ని సంపన్న కుటుంబాల వారు డబ్బు చెల్లించేందుకు ముందుకు వస్తుంటారని చెప్పారు. అయితే ఆ డబ్బును పేద మహిళలకు అందచేయాలని వారికి సూచిస్తుంటామని అన్నారు.

తద్వారా పేద మహిళలు కనీసం మూడు నెలలు ప్రసూతి సెలవును పొందగలరని చెప్పారు. ఓ కార్మికుడు (ఆదినాథ్ 67), పని మనిషి (సింధు 60) దంపతుల కుమారుడైన రఖ్ 2001లో వైద్యవిద్యను పూర్తి చేశారు. స్కాలర్‌షిప్‌ల ద్వారా చదువుకున్న తాను సమాజానికి తిరిగి తనవంతు సేవలందించాలన్న ఆశయంతో ఆస్పత్రిని ప్రారంభించారు. తన ప్రయత్నానికి ఇతర డాక్టర్లు, సిబ్బంది కూడా సహకరిస్తున్నారని రఖ్ చెప్పారు.
 
జీతాలు ఆలస్యమైనా వారు సణుగుకోవడం లేదని అన్నారు. త్వరలోనే ముందస్తుగా పుట్టే శిశువుల కోసం ఓ 15 పడకల నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను ప్రారంభించనున్నామని చెప్పారు. తాను వెలిగించిన చిన్న కొవ్వొత్తి నేడు వెలుగు విరజిమ్ముతోందని రఖ్ పేర్కొన్నారు. అహ్మద్‌నగర్, బీడ్, లాతూర్, ఉస్మానాబాద్, ఔరంగాబాద్ తదితర ప్రాంతాలకు రఖ్ పేరు విస్తరించింది. గుజరాత్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కూడా పర్యటించి అక్కడి ఆస్పత్రుల్లో ఆడపిల్ల పుడితే ప్రసూతి సేవలు ఉచితంగా ఎలా అందించవచ్చో సూచనలు చేస్తున్నానని చెప్పారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా హర్యానాలోని ఓ చిన్న పట్టణంలో, అక్కడి పురుషులు తమకు పెళ్లిళ్లు చేసే వారికి ఓటు వేస్తామని ప్రకటించారని, ఇది తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని రఖ్ చెప్పారు.
 
 గతంలో ఇక్కడ భ్రూణ హత్యలకు పాల్పడడం వల్లనే 30, 40 ఏళ్లు దాటిన తరువాత కూడా పురుషులు బ్రహ్మచారులుగానే ఉన్నారని వాపోయారు. పేదలతో పాటు మధ్యతరగతి, ఎగువ తరగతి వర్గాలు కూడా భ్రూణహత్యలకు పాల్పడుతున్నాయని రఖ్ తెలిపారు. కొద్ది సంవత్సరాల్లోనే దీని దుష్ర్పభావాలు కనిపిస్తాయని చెప్పారు. మగ లేదా ఆడ శిశువు జననాన్ని సమాజం సమానంగా పరిగణించేంత వరకు పోరాటం కొనసాగిస్తానని, తనకు తన తల్లిదండ్రులతో పాటు, భార్య, కూతురు మద్దతు కూడా ఉందని రఖ్ స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు