‘రిపోర్టింగ్‌ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి’

22 Apr, 2020 13:35 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశంలోని పలువురు మీడియా ప్రతినిధులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ(ఐ అండ్‌ బీ) పలు సూచనలు జారీచేసింది. కరోనాకు సంబంధించిన వార్తలు కవర్‌ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని మీడియా ప్రతినిధులను కోరింది. ఈ మేరకు బుధవారం ఐ అండ్ ‌బీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘దేశంలోని పలు ప్రాంతాల్లో రిపోర్టింగ్‌ చేస్తున్న మీడియా ప్రతినిధుల్లో చాలా మందికి కరోనా సోకినట్టుగా తమ దృష్టికి వచ్చింది. కరోనాకు సంబంధించి వార్తలు సేకరిస్తున్న మీడియా ప్రతినిధులు(రిపోర్టర్లు, కెమెరామెన్లు, ఫొటోగ్రాఫర్‌లు‌..) కంటైన్‌మెంట్‌ జోన్లు, హాట్‌స్పాట్స్‌, కరోనా ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లాల్సి వస్తోంది. అలా వెళ్లే మీడియా ప్రతినిధులు వారి విధులు నిర్వర్తించేటప్పుడు ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే క్షేత్రస్థాయిలో వార్తలను సేకరిస్తున్న రిపోర్టర్‌లతోపాటుగా ఆఫీసులో పనిచేసే సిబ్బందికి సంబంధించి మీడియా సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని విజ్ఞప్తి చేసింది. 

కాగా, దేశంలో ఇప్పటికే పలువురు మీడియా ప్రతినిధులకు కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. ముంబైలో 53 మంది మీడియా ప్రతినిధులకు, చైన్నెలోని ఓ టీవీ చానల్‌లో పనిచేస్తున్న 27 మంది జర్నలిస్టులకు కరోనా సోకింది. దీంతో ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, ఢిల్లీ ప్రభుత్వాలు మీడియా ప్రతినిధులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి. 

చదవండి : న్యూస్‌ ఛానల్‌లో పని చేస్తున్న 27 మందికి కరోనా

జ‌ర్న‌లిస్టుల‌ను వ‌ణికిస్తున్న క‌రోనా: ఒక్క‌రోజే 53 మందికి..

మరిన్ని వార్తలు