‘వర్షాకాలం’లో రాజకీయ వేడి

17 Jul, 2017 00:56 IST|Sakshi
‘వర్షాకాలం’లో రాజకీయ వేడి

► నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
► పలు అంశాలతో విపక్షాల ఎజెండా ఖరారు
► కశ్మీర్, చైనాపై చర్చ జరగాల్సిందే: కాంగ్రెస్‌  


న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలు అంశాలపై ప్రభుత్వం విపక్షాలతో చర్చించి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. అయినా పార్లమెంటులో పలు కీలకాంశాల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు 18 విపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయి.

గోరక్షణ పేరుతో హత్యలతోపాటు కశ్మీర్‌లో హింస, సిక్కిం సరిహద్దుల్లో ఉద్రిక్తత, మధ్యప్రదేశ్‌లో రైతులపై కాల్పులు, వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ ప్రభావం, అవినీతి కేసుల పేరుతో విపక్షాలపై దాడులు తదితర అంశాలపై కత్తులు నూరుతున్నాయి. అయితే విపక్షాలు లేవనెత్తే అంశాలపై చర్చ జరిపేందుకు తాము సిద్ధమేనని పార్లమెంటు వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తెలిపారు.

డిమాండ్లను అంగీకరించకపోతేనే..
‘పార్లమెంటు సమావేశాలు జరగకుండా చేయాలని ఎందుకనుకుంటాం. మేం చేసే న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోవటంతోనే సమస్య ఉత్పన్నమవుతోంది’ అని కాంగ్రెస్‌ రాజ్యసభాపక్షనేత గులాంనబీ ఆజాద్‌ వెల్లడించారు. భౌగోళిక సమగ్రత, దేశ భద్రత అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు తమ మద్దతుంటుందన్నారు.

అయితే కశ్మీర్, చైనా అంశాలపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ‘కశ్మీర్‌పై చర్చలకు ప్రభుత్వం అన్ని దార్లూ మూసేసింది. అందుకే లోయలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కశ్మీర్‌లో యువకుల వద్ద తుపాకులు తీసేస్తే సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని కేంద్రం భావిస్తున్నట్లయితే దీనికి మా మద్దతుండదు’ అని ఆజాద్‌ స్పష్టం చేశారు.

‘గోరక్ష’పై ఏం చేస్తున్నారు?
గోరక్ష విషయంలో కేంద్రం ఏం చర్యలు చేపడుతుందో చెప్పాలని డిమాండ్‌ చేయనున్నట్లు సీపీఐ నేత డి.రాజా తెలిపారు. సోమవారం సభ ప్రారంభమైన తర్వాత ఇటీవల కన్నుమూసిన సభ్యులకు (కేంద్ర మంత్రి అనిల్‌ దవే, కాంగ్రెస్‌ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి (ఇద్దరు రాజ్యసభ సభ్యులు), గురుదాస్‌పూర్‌ లోక్‌సభ ఎంపీ వినోద్‌ ఖన్నా) నివాళులర్పించిన అనంతరం ఉభయసభలు వాయిదా పడనున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక కూడా జరగనుంది. ఈ సమావేశాలు ఆగస్టు 11 వరకు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు