'దావూద్‌ను పట్టుకోవడం అంత ఈజీ కాదు'

22 Nov, 2015 09:23 IST|Sakshi
'దావూద్‌ను పట్టుకోవడం అంత ఈజీ కాదు'

ముంబై: అండర్‌ వరల్డ్‌ డాన్ దావూద్‌ ఇబ్రహీంను పట్టుకోవడం అంత సులభం కాదని, ఎందుకంటే అతను మన శత్రు దేశం రక్షణలో ఉన్నాడని ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ నీరజ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఇటీవల అరెస్టైన దావూద్ బద్ధ విరోధి, గ్యాంగ్‌స్టర్‌ ఛోటారాజన్‌ కూడా చేసే సాయమేమీ లేదని ఆయన చెప్పారు.

'దావూద్‌ పట్టుకోగలమని మేం చెప్పలేం. ఎందుకంటే పాకిస్థాన్‌ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కనుసన్నలో అతను ఉండటం. అతన్ని పట్టితేవాలన్న రాజకీయ చిత్తశుద్ధి మన దేశానికి లేకపోవడం. శత్రుదేశం రక్షణలో ఉండటం వల్లే అతను ఇంకా మనకు పట్టుబడకుండా ఉండగలుగుతున్నాడు. పరారీలో ఉన్న అతన్ని పట్టుకోవడం అంత సులభమేమీ కాదు' అని ఆయన చెప్పారు. నీరజ్‌కుమార్ 'డయల్ ఫర్ డాన్‌' పేరిట రాసిన పుస్తకాన్ని ముంబైలో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నీరజ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా ప్రయత్నిస్తే దావూద్‌ను భారత్‌కు తీసుకొచ్చి శిక్షించే అవకాశముంటుందని చెప్పారు.

1990లలో దావూద్ లొంగిపోవడానికి ముందుకొచ్చాడని నీరజ్‌కుమార్ తన పుస్తకంలో వెల్లడించడం.. ఇటీవల మీడియా పతాక శీర్షికలకు ఎక్కిన సంగతి తెలిసిందే. దావూద్‌తో తాను మూడుస్లారు ఫోన్లో సంభాషించానని, చివరిసారిగా తాను రిటైర్మెంట్‌కు ముందు 2013లో అతని నాకు ఫోన్‌ చేశాడని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు