లాక్‌డౌన్‌ : వాట్సప్‌ను తెగ వాడేస్తున్నారు

27 Mar, 2020 12:25 IST|Sakshi

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. గడప దాటి కాళ్లు బయటపెట్టలేని పరిస్థితి కారణంగా ప్రజలంతా సామాజిక మాధ్యమాలపై పడ్డారు. దీంతో వాట్సప్‌, ఫేస్‌బుక్‌ను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో సోషల్‌ మీడియా దిగ్గజం వాట్సప్‌లో నెటిజన్లు గడిపే కాలం అమాంతం పెరిగిపోయింది. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మొదట్లో 27 శాతం పెరిగిన యూజర్ల సంఖ్య.. కరోనా మొదట దశ ముగిసే సరికి ఆ సంఖ్య 41 శాతానికి పెరిగింది. (కరోనాపై యుద్ధం గెలుద్దాం)

ఇక వైరస్‌ రెండోదశకు చేరుకుని తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ.. ఏకంగా 51శాతానికి పెరిగిందని ఓ సంస్థ చేపట్టిన సర్వేలో తేలింది. వీరిలో 40శాతానికిపైగా 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల వారేకావడం గమనార్హం. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌ వాడకం 50శాతం పెరిగిందని ఆ సంస్థ తన సర్వేలో పేర్కొంది. వాట్సప్‌తో పాటు మెస్సెంజర్‌ వాడకంలో 70శాతం ఇటలీ తొలిస్థానంలో నిలవగా.. వీడియో కాల్స్‌ మాట్లడం ఒక్కసారిగా 1000శాతం పెరిగింది. కాగా భారత్‌తో పాటు ప్రపంప వ్యాప్తంగా పలు దేశాల్లో లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలంతా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. వీరంత సామాజిక మాధ్యమాల్లో కాలక్షేపం చేస్తున్నారు. (ఈ వాట్సాప్‌ నంబరు సేవ్‌ చేసుకోండి!)

ఇక సెలబ్రెటీలు సైతం సోషల్‌ మీడియా ద్వారా కరోనాపై ప్రజలకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. దీంతో వారిని అనుసరించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మరోవైపు పలు సాఫ్ట్‌వేర్‌ సంస్థలతో పాటు ప్రైవేటు కంపెనీలు వర్క్‌ఫ్రమ్‌ హోం (ఇంటి నుంచి పని) పద్దతిని అవలంభిస్తున్నాయి. దీంతో ఉద్యోగులంతా సమాచారం కోసం వాట్సప్‌ గ్రూపులు, వీడియోలు కాల్స్‌ చేయడం ఎక్కువగా జరుగుతోంది. దీంతో సాధారణంగానే సోషల్‌మీడియా వాడటం పెరుగుతోంది. అంతేకాక సోషల్‌ మీడియాలో యువత ముచ్చట్లు, చాటిం‍గ్స్‌ కూడా ఎక్కువే.


 

మరిన్ని వార్తలు