భారత్‌- అమెరికా మైత్రి బలోపేతం: ప్రధాని మోదీ

16 May, 2020 16:32 IST|Sakshi

ట్రంప్‌నకు ధన్యవాదాలు: ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌పై పోరులో భాగంగా భారత్‌కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. విపత్కర సమయంలో పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటున్న భారత్‌- అమెరికా స్నేహబంధం మరింత బలపడుతుందంటూ సోషల్‌ మీడియా వేదికగా ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు.. ‘‘మహమ్మారి కరోనాపై మనమంతా కలిసికట్టుగా పోరాడుతున్నాం. ఇలాంటి సమయాల్లో దేశాలన్నీ కలిసి పనిచేస్తూ ముందుకు సాగాలి. కోవిడ్‌-19ను తరిమికొట్టి ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి శాయశక్తులా ప్రయత్నించాలి. మీకు కృతజ్ఞతలు ట్రంప్‌. భారత్‌- అమెరికా మైత్రి మరింత బలోపేతం అవుతుంది’’అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.(ఈ ప్రచ్ఛన్న యుద్ధం ఎందాకా?)

కాగా భారత్‌లో ఉన్న తమ స్నేహితులకు వెంటిలేటర్లు డొనేట్‌ చేయడాన్ని ప్రకటించేందుకు గర్వపడుతున్నానంటూ ట్రంప్‌ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. కరోనాపై పోరులో భారత్‌కు అండగా ఉంటామని.. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు ఇరు దేశాలు సహకరించుకుంటున్నాయని తెలిపారు. ఈ విషయం గురించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘నా స్నేహితుడు, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడాను. కొన్ని వెంటిలేటర్లు భారత్‌కు పంపిస్తున్నాం. అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత మా మధ్య స్నేహం మరింత బలపడింది’’అని పేర్కొన్నారు. కాగా కరోనా రోగుల చికిత్సలో సత్ఫలితాలు ఇస్తుందని భావిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌కు భారత్‌ అమెరికాకు ఎగుమతి చేసిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అభ్యర్థన మేరకు దాదాపు 50 మిలియన్ల యూనిట్లను మార్చిలో అక్కడికి పంపింది.(ఉచితంగా వెంటిలేటర్లు :  ట్రంప్ కీలక ప్రకటన)

>
మరిన్ని వార్తలు