ప్యాకేజీ 4.0: నిర్మాణాత్మక సంస్కరణలకు ప్రాధాన్యం

16 May, 2020 16:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను కట్టడి చేయటానికి విధించిన లాక్‌డౌన్‌తో కుదేలయిన ఆర్థిక రంగ పునరుత్తేజం, స్వావలంబ భారత్‌ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం వెల్లడించారు. తీవ్ర పోటీని ఎదుర్కొనే విధంగా మనల్ని మనం తయారు చేసుకోవాల్సి ఉందని ఆమె అన్నారు. వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్భుతమైన సంస్కరణలు చేపట్టారన్నారు. ప్రత్యక్ష పెట్టుబడుల్లో తీసుకువచ్చిన సంస్కరణలు అద్భుతమైన ఫలితాలనిస్తున్నాయని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ( అనుబంధ వ్యవ‘సాయా’నికి! )

తమ ప్రభుత్వ హయాంలోనే జీఎస్టీకి మోక్షం లభించిందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. నేడు ప్రధానంగా నిర్మాణాత్మక సంస్కరణలకు ప్రాధాన్యమిస్తున్నామని, పెట్టుబడులను వేగవంతం చేసేందుకు విధానపరమైన సంస్కరణలు చేపట్టామన్నారు. పారిశ్రామిక రంగంలో మౌళిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భూ బ్యాంకుల ఏర్పాటుతో పాటు పారిశ్రామిక క్లస్టర్ల గుర్తించామన్నారు. 5 లక్షల హెక్టార్లలో 3376 ఇండస్ట్రియల్ పార్కుల గుర్తింపు, బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రైవేటు రంగానికి అవకాశం ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

నిర్మల ప్రసంగంలోని మరికొన్ని అంశాలు..

  • 50 బొగ్గు బ్లాకులలో వేలం ద్వారా ప్రైవేటు కంపెనీలకు అవకాశం.
  • నిర్ణీత గడువులో బొగ్గు ఉత్పత్తిని పూర్తి చేసిన కంపెనీలకు ప్రోత్సహాకాలు.
  • ఖనిజాల తవ్వకాల కోసం 500 బ్లాకుల్లో వేలం పాట ద్వారా అందరికి అవకాశం.
  • ఖనిజాల తవ్వకాల్లో ప్రైవేటు పెట్టుబడులకు పెద్దపీట.
  • బొగ్గు గనులకు సంబంధించి పునరావాసం కోసం 50వేల కోట్లు కేటాయింపు.
  • ఖనిజాల రవాణాను సులభతరం చేసేందుకు 18వేల కోట్లతో రైల్వే లైన్‌ల ఏర్పాటు.
  • రక్షణరంగాన్ని బలోపేతం చేసేందుకు ఆధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది.
  • రక్షణ రంగానికి సంబంధించిన కొన్ని రకాల ఆయుధాలను దేశీయంగా తయారుచేసుకుంటాం.
  • కొన్ని రకాల రక్షణ ఉత్పత్తులను మనం తయారు చేసుకోగలిగినప్పటికీ... వాటిని చాలాకాలంగా దిగుమతి చేసుకుంటున్నాం.
  • రక్షణ రంగానికి ఆయుధాలను సరఫరా చేసే ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీని మరింత బలోపేతం చేస్తాం.
  • ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుల పనితీరును మెరుగుపరిచేందుకు వాటిని కార్పోరేట్ స్థాయికి తీసుకువెళ్తాం... అయితే వాటిని ప్రైవేటీకరించము.
  • రక్షణరంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49శాతం నుంచి 74శాతానికి పెంపు.
మరిన్ని వార్తలు