లాక్‌డౌన్‌పై ప్రధాని ప్రసంగం నేడు!

14 Apr, 2020 04:09 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 21 రోజుల దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఈ రోజుతో ముగియనున్న విషయం తెలిసిందే. మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ పొడిగిస్తారని, ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు కొన్ని నిబంధనల సడలింపు ఉంటుందని ఇప్పటికే కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని ప్రసంగానికి ప్రాధాన్యమేర్పడింది. పలు రాష్ట్రాలు ఏప్రిల్‌ 14 తరువాత కనీసం రెండు వారాల లాక్‌డౌన్‌ పొడిగింపునకే మొగ్గు చూపుతుండగా ప్రభుత్వం మాత్రం కోవిడ్‌–19ను నిరోధించడం, అదే సమయంలో దశలవారీగా ఆర్థిక కార్యకలాపాలను మొదలుపెట్టడం అన్న ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళుతోందని ఓ అధికారి తెలిపారు.

భౌతిక దూరం కచ్చితంగా పాటించేందుకు అనువుగా లాక్‌డౌన్‌ను పొడిగించినప్పటికీ ఆర్థిక కార్యకలాపాలను నడిపించేందుకు వీలుగా కొన్ని మినహాయింపులూ ప్రధాని ప్రకటించవచ్చునని అంచనా. ప్రాణాలతోపాటు, జీవనోపాధులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని గత శనివారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ వ్యాఖ్యానించిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం. ‘లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నప్పుడు నేను ప్రాణముంటే ప్రపంచం ఉంటుందని చెప్పాను. దేశంలోని అధికులు దీన్ని అర్థం చేసుకున్నారు. ఇళ్లల్లోనే ఉండి తమ బాధ్యతలు నెరవేర్చారు. ఇప్పుడు దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రాణాలతోపాటు జీవనోపాధులపై కూడా దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది’ అని మోదీ ఆ సమావేశంలో వివరించారు. మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, అరుణాచల్‌ప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30వ తేదీ వరకూ పొడిగించిన విషయం తెలిసిందే.  

కార్యాలయాలకు కేంద్ర మంత్రులు..
ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు అనువుగా సోమవారం పలువురు కేంద్ర మంత్రులు ఢిల్లీలోని తమ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించడం మొదలుపెట్టారు.   ‘లాక్‌డౌన్‌లో ఎక్కువ కాలం ఇంటి నుంచే పనిచేశాను. ఈ రోజు శాస్త్రి భవన్‌లోని కార్యాలయానికి తిరిగి వచ్చా. మోదీ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిస్థాయిలో పనిచేసేందుకు సిద్ధమైంది’’అని బొగ్గు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి వ్యాఖ్యానించారు. సమాచార ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్‌ జవదేకర్, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, రైల్వే, వాణిజ్య శాఖల మంత్రి పీయూష్‌ గోయెల్, యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ సోమవారం తమ తమ కార్యాలయాలకు వచ్చిన వారిలో ఉన్నారు. జాయింట్‌ సెక్రటరీలు, అంతకంటే పై స్థాయి అధికారులకు రవాణా సౌకర్యం ఉండటం వల్ల వారు కార్యాలయాలకు రాగా.. రెండు, మూడు, నాలుగో తరగతుల ఉద్యోగులు వంతుల వారీగా వస్తున్న విషయం తెలిసిందే. అవసరమైనంత రక్షణ ఏర్పాట్లతో గుర్తించిన పరిశ్రమలు, సేవలను అందుబాటులోకి తేవాలని దేశీ పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహక మండలి ఇప్పటికే సూచించింది కూడా.

మరిన్ని వార్తలు