సామాజిక మాధ్యమాలపై సీ'ఐ'డీ  | Sakshi
Sakshi News home page

సామాజిక మాధ్యమాలపై సీ'ఐ'డీ 

Published Tue, Apr 14 2020 4:14 AM

CID Focus On Social Media - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లు పెట్టే వారికి శిక్ష తప్పదు. సోషల్‌ మీడియాలో ఇష్టానుసారం తప్పుడు వార్తలను (ఫేక్‌ న్యూస్‌) వైరల్‌ చేసే పోకడలను దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఐడీ ఇప్పటికే రంగంలోకి దిగింది. వాట్సప్, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి తప్పుడు పోస్టులు పెడితే సీఐడీ తీసుకునే చట్టపరమైన చర్యలు ఇలా ఉంటాయి.

ప్రభుత్వ బాధ్యుల్ని కించపరిస్తే జైలే
► దేశంతోపాటు ప్రభుత్వాలు, ప్రభుత్వ బాధ్యులను కించపరిచే వ్యాఖ్యలు, వారికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే పోస్టింగ్‌లు పెడితే ఐపీసీ సెక్షన్‌–124ఏ (రాజద్రోహం) కింద కేసు నమోదు చేస్తారు. ఇది నాన్‌ బెయిలబుల్‌ కేసు. మూడేళ్ల నుంచి జీవిత ఖైదుతోపాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. 
► నిరాధారమైన విషయాలు, రూమర్లు, అబద్ధాలు పోస్ట్‌ చేసినా చర్యలు తప్పవు. వ్యక్తులు, పార్టీలు, మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా.. కించపర్చేలా ఉండే పోస్టులు, వార్తలు, ఫొటోలు ప్రచురిస్తే ఐపీసీ సెక్షన్‌–505 కింద నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేస్తారు. నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా తప్పవు. 
కరోనా విషయమై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం, పోస్టింగ్‌లు, లేని విషయాలను ఉన్నట్టు ప్రచారం చేయడం, ప్రభుత్వ ఉత్తర్వులు, అధికారుల ఆంక్షలను ఉల్లంఘించే చర్యలపై అంటువ్యాధుల చట్టం–54 ప్రకారం కేసు నమోదు చేస్తారు. ఏడాది వరకు జైలు, జరిమానా విధించే అవకాశం ఉంటుంది. 

సోషల్‌ మీడియాపై నిఘా పెట్టాం
కరోనా నేపథ్యంలో తప్పుడు ప్రచారం, తప్పుడు పోస్టింగ్‌లు పెట్టే వారిపై కేసులు నమోదు చేస్తాం. ఇందుకోసం సోషల్‌ మీడియాపై సీఐడీ ప్రత్యేక బృందంతో నిరంతర నిఘా పెట్టాం. ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించి సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తాం.
– పీవీ సునీల్‌కుమార్, ఏడీజీ, ఏపీ సీఐడీ 

Advertisement
Advertisement