వైరల్‌ వీడియో: మురికి కాలువను శుభ్రం చేసిన సీఎం

2 Oct, 2018 11:34 IST|Sakshi
మురికి కాలువ శుభ్రం చేస్తున్న పుదుచ్చేరి సీఎం వి నారాయణస్వామి

పుదుచ్చేరి : స్వచ్ఛ భారత్‌లో భాగంగా మన నాయకులు, సినిమా ప్రముఖులు, క్రీడాకారులు ఇలా ఒక్కరనేంటి దాదాపు దేశంలోని ప్రముఖులందరు కూడా చీపురు పట్టి రోడ్లు ఉడ్చిన సంఘటనలు అనేకం జరిగాయి. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఓ వ్యక్తి స్వయంగా పార చేత పట్టుకుని మురికి కాలువలను శుభ్రం చేసిన సంఘటనలను ఎక్కడా చూసి ఉండం. కానీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఓ వీడియో చూస్తే ఆ లోటు కూడా తీరిపోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘స్వచ్ఛతాహై సేవా’ కార్యక్రమంలో భాగంగా ఓ ముఖ్యమంత్రి మురికి కాలువలో ఉన్న చెత్తను తొలగించారు.

నలుగురికి చెప్పే ముందు మనం ఆచరించాలని చెప్పిన ఈ వ్యక్తి పుదుచ్చేరి కాంగ్రెస్‌ సీఎం వీ నారాయణస్వామి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో నారాయణస్వామి స్వయంగా మురికి కాలువలో ఉన్న చెత్తను తొలగించారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఆయనను అభినందనలతో ముంచెత్తుతున్నారు. నారాయణ స్వామి చేసిన పనిని మెచ్చుకుంటూ.. ‘మీరు ఏదో ఫొటోలకు ఫోజులు ఇవ్వడం కోసం ఈ పని చేస్తున్నట్లు లేరు. చాలా నిజాయితీగానే మురికి కాలువలోకి దిగి అక్కడ ఉన్న చెత్తను తొలగిస్తున్నార’ని కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. ‘కార్యకర్తలకు మీరు ఓ రోల్‌మోడల్‌గా నిలిచారు. మీరు చేసిన పని మాకు మరింత ఉత్సాహన్నిచ్చింద’ని కాంగ్రెస్‌ అభిమాని ఒకరు వ్యాఖ్యానించారు.

కానీ మరికొందరు మాత్రం ‘ఇప్పటికైనా మీకు పారిశుద్ధ్య కార్మికుల కష్టాలు అర్థం కావాలని కోరుకుంటున్నాం. వారికి సరైన పరికరాలు అందజేయండి’ అంటూ కామెంట్‌ చేశారు.

మరిన్ని వార్తలు