‘కొండంత' అవమానాలు | Sakshi
Sakshi News home page

‘కొండంత' అవమానాలు

Published Tue, Oct 2 2018 11:36 AM

Konda Family Slams TDP Party - Sakshi

సాక్షి, తిరుపతి: తంబళ్లపల్లి నియోజకవర్గంలో ‘కొండా’ కుటుంబం  తెలియని వారుండరు. టీడీపీకి ఈ కుటుంబం కేరాఫ్‌. పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతోనే ఉంది. ప్రతి ఎన్నికల్లోనూ ఈ కుటుంబం కీలకం.  కొండా కుటుంబంపై ప్రజలకున్న అభిమానమే గత ఎన్నికల్లో టీడీపీని గెలిపిం చింది. అలాంటి కుటుంబానికి పార్టీ నుంచి అవమానాలు ఎదురయ్యాయి. అక్రమ కేసులు బనాయించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ అవుతారనే అభద్రతాభావంతో స్థానిక ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఈ కుటుంబాన్ని పొమ్మనలేక పొగబెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. పెద్దతిప్పసముద్రం మండలం కుర్రావాండ్లపల్లెకు చెందిన దివంగత మాజీ ఎంపీపీ కేసీ జనార్దనరెడ్డి ఆవిర్బావం నుంచి టీడీపీలో కొనసాగారు. ములకలచెరువు, పెద్దతిప్పసముద్రం, తంబళ్లపల్లె మండలాల్లో ఈయనకు వర్గబలం ఉంది. రాజకీయాల్లో హేమాహేమీలతో కలిసి పనిచేసిన ఆయన కేసీగా సుపరిచితుడు. 1995–2000 వరకు ఎంపీపీగా పనిచేశారు. గతేడాది జనార్దనరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం కొండా గీతమ్మ ఎంపీపీగా, ఆమె తనయుడు సిద్దార్థ మండల పరిషత్‌ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. కొద్దికాలంగా కొండా కుటుంబానికి సొంత పార్టీ  నుంచి అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. 2014 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అహరహం పనిచేసిన తమకు ఈ పరిస్థితేంటని ఈ కుటుంబం ఇప్పుడు ఆవేదన చెందుతోంది.

అక్రమ కేసులు... అవమానాలు
గీతమ్మ విధుల్లో ఎమ్మెల్యే జోక్యం పెరిగిపోయినట్లు తెలిసింది. ఆమె ప్రాధాన్యతను తగ్గిస్తూ వస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అభివృద్ధి పనుల విషయంలో కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆమె భావిస్తున్నారు.  ఎంపీపీ చైర్మన్‌గా ఉండే కమిటీ వ్యవహరాల్లోనూ ఎమ్మెల్యే, ఆయన వర్గీయులు జోక్యం చేసుకోవటంతో పాటు అధికారుల వద్ద విలువ లేకుండా చేస్తున్నారనే విమర్శలున్నాయి. గీతమ్మ మడుమూరు ఎంపీటీసీ. ఆమె గ్రామంలో రోడ్డు విషయంలో వివాదం తలెత్తింది. స్థానికులు ఆందోళన చేస్తే ఎమ్మెల్యే వర్గీయులు తమపై అక్రమ కేసులు బనాయించారని కొండా వర్గీయులు రగిలిపోతున్నారు.  కొండా కుటుంబాన్ని తక్కువ చేయాలనే ఉద్దేశంతో కేసులు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. తంబళ్లపల్లె మండలంలో జంజూరంపెంట పంచాయతీ భవనం నిర్మాణ విషయంలోనూ కొండా వర్గానికి చెందిన  75మందిపై కేసులు నమోదు చేశారు. బూర్లపల్లి ఎంపీటీసీ సభ్యుడు రమణ మధ్యవర్తిత్వం చేసినందుకు  అక్రమ కేసు బనాయించారు.  సొంతపార్టీ వారిపైనే కేసులు నమోదు చేస్తున్నారన్న విషయం జిల్లా పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితుల్లో మార్పులేదు. కొండా కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని అధికారులకు ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు చెప్పినట్లు తెలిసింది. కార్పొరేషన్‌ రుణాల మంజూరులో కొండా వర్గీయులకు రాకుండా చేశారనే ఆరోపణలున్నాయి. పార్టీ కోసం సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తే నియోజకవర్గంలో అడుగడుగునా అవమానిస్తూ అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని కొండా వర్గీ యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement