వివాహితుడితో కలిసి ఉండేందుకు అనుమతిచ్చిన కోర్టు

26 Mar, 2019 10:14 IST|Sakshi

జైపూర్‌ : రాజస్తాన్‌ హై కోర్టు సోమవారం సంచలన తీర్పిచ్చింది. వివాహితుడైన వ్యక్తిని ప్రేమించిన మహిళను అతనితోనే కలిసి జీవించవచ్చని పేర్కొంది. మొయినుద్దీన్‌ అబ్బాసి అనే వ్యక్తి వేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను విచారించిన డివిజన్‌ బెంచ్‌ న్యాయమూర్తులు సందీప్‌ మెహతా, వినిత్‌ కుమార్‌ మథూర్‌ ఈ సంచలన తీర్పును వెల్లడించారు.

వివరాలు..  రూపాల్‌ సోనీ అనే మహిళ(26) మొయినుద్దీన్‌ అబ్బాసీ అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే వీరి వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో.. 2018, జూలై 23న రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సోనీని ఇంట్లో బంధించారు. దాంతో మొయినుద్దీన్‌ తన భార్యను చూపించాలంటూ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. విచారణలో భాగంగా గత ఏడాది మార్చి 13న పోలీసులు సోనీని కోర్టు ముందు హాజరుపర్చారు. అయితే విచారణలో పలు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.

మొయినుద్దీన్‌కు ఇంతకు ముందే వివాహం జరిగిందని.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది. అయినప్పటికి అతను సోనీని ఇంటర్‌ ఫెయిత్‌(నమ్మకం) వివాహం చేసుకున్నాడని.. తర్వాత దాన్ని రిజిస్టర్‌ చేయించాడని విచారణలో తెలీంది. ఆశ్యర్యపోయిన కోర్టు కేసుకున్న సున్నిత స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని సోనీని ఉదయ్‌పూర్లో ఉన్న ప్రభుత్వ మహిళా సంక్షేమ కేంద్రానికి పంపించింది. అనంతరం కోర్టు సోనీకి ఆమె భవిష్యత్తు గురించి.. తర్వాత ఎదుర్కొబోయే పరిణామాల గురించి కౌన్సిలింగ్‌ ఇప్పించింది. ఆపై నిన్నటి విచారణలో భాగంగా కోర్టు సోనీ నిర్ణయం గురించి ప్రశ్నించింది.

అందుకు ఆమె తన బంధాన్ని కొనసాగిస్తానని.. మొయినుద్దీన్‌తోనే కలిసి ఉంటానని కోర్టుకు తెలిపింది. దాంతో కోర్టు ‘సదరు మహిళ మేజర్‌, పూర్తి మానసిక పరిపక్వత కల్గిన వ్యక్తి, హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అందువల్ల కోర్టు ఆమె నిర్ణయాన్ని గౌరవించి మొయినుద్దీన్‌తో కలిసి ఉండేందుకు అనుమతిస్తూ తీర్పునిస్తున్ను’ట్లు పేర్కొంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు