పెళ్లి ఖర్చు 5 లక్షలు దాటితే....

15 Feb, 2017 20:45 IST|Sakshi
పెళ్లి ఖర్చు 5 లక్షలు దాటితే....

న్యూఢిల్లీ : ఈరోజుల్లో పెళ్లి అనగానే... బోలెడంత ఖర్చు. వేలు, లక్షలు, కోట్లలోకి కూడా వెళ్లింది. పెళ్లి అనగానే హంగులు, ఆర్భాటలెక్కువయ్యాయి. ఒకరిని చూసి మరొకరు అన్నట్టు... ఆ మాత్రం ఖర్చు చేయకపోతే ఎలా? వచ్చిన అతిథులంతా ఏమనుకుంటారు? అన్న చందంగా పెళ్లిళ్ల ధోరణిలోనే మార్పులొస్తున్నాయి. తల తాకట్టు పెట్టి అన్న చందంగా.. పెళ్లి అనగానే ఎన్నో అప్పులు చేసి మరీ ఆర్బాటాలకు పోతున్నారు.

పెళ్లిలో పెడుతున్న ఖర్చుల్లో ఎంత మేరకు ఉపయోగపడుతున్నాయి. నిజానికి ఇందులో వృధా అయ్యే ఖర్చే బోలెడంత. ఉదయం పెళ్లంటే... అలంకరణ కోసం వెచ్చిస్తున్న లక్షలాది రూపాయలు సాయంత్రానికి ఖర్చయిపోతున్నాయి. ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. ఇలా పెళ్లిళ్ల ఖర్చులు పెరుగుతూ పోతే ఎలా మరి? వీటిని ఎలా నియంత్రించాలి? ఇలాంటి ధోరణులకు స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చిందంటూ... కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ, పప్పూ యాదవ్ సతీమణి రంజీత్ రంజన్ లోక్ సభలో ఒక ప్రతిపాదన చేశారు. దీనికి సంబంధించి బుధవారం లోక్ సభలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రతిపాదించారు.

పెళ్లి ఖర్చు 5 లక్షలు దాటితే ఆ మొత్తంలో 10 శాతం పేద యువతుల వివాహానికి విరాళంగా అందజేయాలి. వివాహాలు (నిర్బంధ రిజిస్ట్రేషన్ - అనవసరపు ఖర్చుల నియంత్రణ) బిల్లు ను ఆమె ప్రతిపాదించారు. పెళ్లిళ్లు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా జరగాలని ఆమె ప్రతిపాదించారు. పెళ్లిళ్లలో ముఖ్యంగా వృధా అవుతున్న ఆహారం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పెళ్లిళ్లకు అతిథులను ఆహ్వానించడంలో సంఖ్యను పరిమితం చేయాలని, ఆహార పదార్థాల సంఖ్యపైన పరిమితులు విధించాలని ఆ బిల్లు లో ప్రతిపాదించారు.

పెళ్లిళ్లలో విపరీతంగా ఖర్చు చేయడం ఒక వ్యాధిలా మారుతోందని, దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందన్న అంశంపై భారతదేశంలో ఎప్పటినుంచో చర్చ సాగుతోంది. ఎంతో మంది నిపుణులు అనేక సలహాలు, సూచనలు కూడా చేశారు. అయితే అవేవీ అమలులోకి రాకపోగా, పెళ్లిళ్లు అనగానే... ఎంగేజ్ మెంట్, సంగీత్, రిసెప్షన్లు... అంటూ ఇలా అనేక రకాలుగా జోడించి ఖర్చును బారెడు చేశారు. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం రంజీత్ రంజన్ ప్రతిపాదించిన ఈ ప్రైవేటు మెంబర్ బిల్లు లోక్ సభలో ఏ రూపం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.

>
మరిన్ని వార్తలు