‘రొటొమ్యాక్‌’ కొఠారి అరెస్టు

23 Feb, 2018 01:39 IST|Sakshi
విక్రమ్‌ కొఠారి, నీరవ్‌ మోదీ.. ఈడీ జప్తు చేసిన నీరవ్‌ మోదీ లగ్జరీ కార్లు

సీబీఐ అదుపులో విక్రమ్, అతని కుమారుడు

హైదరాబాద్‌లో రూ. 1200 కోట్ల గీతాంజలి గ్రూపు ఆస్తుల అటాచ్‌

పీఎన్‌బీ కేసులో ఈడీ సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల స్వాధీనం... 

బకాయిల చెల్లింపునకు ప్రణాళికతో రండి: నీరవ్‌కు పీఎన్‌బీ లేఖ

ముంబై/న్యూఢిల్లీ: రూ. 3,695 కోట్ల రొటొమ్యాక్‌ కుంభకోణం కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. గత నాలుగు రోజులుగా రొటొమ్యాక్‌ యజమాని విక్రమ్‌ కొఠారి, అతని కుమారుడు రాహుల్‌ను విచారించిన సీబీఐ గురువారం వారిని అదుపులోకి తీసుకుంది. సీబీఐ ప్రధాన కార్యాలయానికి హాజరైన వారిద్దరూ విచారణకు సహకరించకపోవడంతో అరెస్టు చేశామని సీబీఐ ప్రతినిధి వెల్లడించారు. విక్రమ్, రాహుల్‌లు డైరెక్టర్లుగా ఉన్న ‘రొటొమ్యాక్‌ గ్లోబల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ 2008 నుంచి ఏడు జాతీయ బ్యాంకుల నుంచి రూ. 2,919 కోట్ల రుణాలు తీసుకుని దారి మళ్లించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ ఆరోపించిన సంగతి తెలిపిందే. అసలు, వడ్డీ కలిపి బ్యాంకులకు రొటొమ్యాక్‌ కంపెనీ రూ. 3,695 కోట్లకు పైగా చెల్లించాలని తేల్చింది.

హైదరాబాద్‌ సెజ్‌లో..
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ. 11,400 కోట్లకు నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీలు మోసగించిన కేసులో.. పన్ను ఎగవేత ఆరోపణలపై హైదరాబాద్‌ సెజ్‌లో గీతాంజలి గ్రూపునకు చెందిన రూ.1200 కోట్ల ఆస్తిని ఆదాయపు పన్ను శాఖ గురువారం అటాచ్‌ చేసింది. ఇప్పటికే గీతాంజలి గ్రూపు, దాని ప్రమోటర్‌ మెహుల్‌ చోక్సీకి చెందిన 9 బ్యాంకు ఖాతాల్ని, ఏడు ఆస్తుల్ని ఐటీ శాఖ నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో గురువారం ఎనిమిదో రోజూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడులు కొనసాగిస్తూ.. చోక్సీ, అతని గ్రూపునకు చెందిన రూ. 86.72 కోట్లు, మోదీ గ్రూపునకు చెందిన రూ. 7.8 కోట్ల మ్యూచువల్‌ ఫండ్‌లు, షేర్లు స్వాధీనం చేసుకుంది.

రూ.కోట్ల రూపాయల విలువైన కార్లను కూడా స్వాధీనం చేసుకున్నామని.. సీజ్‌ చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ. 100 కోట్లకు పైనే ఉంటుందని ఈడీ తెలిపింది. ఈ కేసులో ఇంతవరకూ రూ. 5,826 కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. సీజ్‌ చేసిన కార్లలో రోల్స్‌రాయిస్‌ ‘ఘోస్ట్‌’, మెర్సిడెస్‌ బెంజ్, పోర్షే పనమెరా, మూడు హోండా కంపెనీ కార్లు, ఒక టయోటా ఫార్చూనర్, ఇన్నోవా ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో నీరవ్‌ కుచెందిన 15 విలాసవంతమైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. నీరవ్‌ గురువారం తన ముందు హాజరుకాకపోవడంతో .. ఈడీ తాజాగా మరోసారి సమన్లు జారీచేసింది. ఫిబ్రవరి 26లోపు హాజరుకావాలని ఆదేశించింది. అయితే తన పాస్‌పోర్టును తాత్కాలికంగా రద్దు చేయడం వల్లే  హాజరుకాలేదని ఈడీకి నీరవ్‌ చెప్పినట్లు సమాచారం.

ఆచరణసాధ్య ఆలోచనతో రండి!
బకాయిల చెల్లింపునకు స్పష్టమైన, ఆచరణ సాధ్యమైన ప్రణాళికతో ముందుకు రావాలని పీఎన్‌బీ కుంభకోణం సూత్రధారి నీరవ్‌ మోదీని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు లేఖలో కోరింది. పీఎన్‌బీ అత్యుత్సాహం వల్లే బకాయిలు చెల్లించే సామర్థ్యం తగ్గిపోయిందని మోదీ రాసిన లేఖకు సమాధానమిస్తూ.. ‘కొందరు బ్యాంకు అధికారులు అక్రమంగా జారీ చేసిన ఎల్‌వోయూల్ని తప్పుడు మార్గాల్లో మీరు పొందారు. ఏ దశలోను అలాంటి సదుపాయాల్ని మీ కంపెనీలకు మా బ్యాంకు కల్పించలేదు’ అని లేఖలో పీఎన్‌బీ జనరల్‌ మేనేజర్‌ (అంతర్జాతీయ బ్యాంకింగ్‌ విభాగం) అశ్వినీ వత్స్‌ పేర్కొన్నారు.

‘మొత్తం అప్పును తీర్చేందుకు మీరు చూపిన నిబద్ధత, చొరవలో ఎక్కడా కూడా ముందస్తు చెల్లింపుల ప్రస్తావన, నిర్దేశిత సమయం పేర్కొనలేదు. ఏదేమైనా బకాయిల్ని తీర్చేందుకు మీ వద్ద సరైన ప్రణాళిక ఉంటే.. ఇప్పటికైనా సమాధానమివ్వండి’ అని లేఖలో పీఎన్‌బీ పేర్కొంది. సంస్థ వాటాలు, ఆస్తులు అమ్మి రుణం చెల్లిస్తానని చెప్పినా.. అత్యుత్సాహంతో ఆస్తుల్ని సీజ్‌ చేసి తన బ్రాండ్‌ పేరును నాశనం చేశారంటూ ఫిబ్రవరి 13, 15 తేదీల్లో పీఎన్‌బీకి నీరవ్‌ లేఖ రాశారు. ఈ పరిస్థితుల్లో బకాయిలు చెల్లించడం కష్టమేనని అందులో పేర్కొన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు