ముందుగా వైద్య సిబ్బందికి టీకా!

30 Jun, 2020 17:13 IST|Sakshi

కరోనాపై పోరాడే యోధులకు ప్రాధాన్యం

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే మహమ్మారిపై పోరాడుతున్న వైద్య సిబ్బందితో పాటు వైరస్‌ ముప్పున్న ప్రజలకు తొలుత టీకాను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో నిర్ణయించారు. వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత దాని అందుబాటును పరిగణనలోకి తీసుకుని సరఫరాకు కార్యాచరణ ప్రణాళిక చేపట్టడంపై ఈ భేటీలో చర్చించారు. వైద్య సరఫరా వ్యవస్థల నిర్వహణ, వైరస్‌ ముప్పున్న జనాభాలకు ప్రాధాన్యత, వివిధ ఏజెన్సీలు..ప్రైవేట్‌ రంగం, పౌరసమాజం మధ్య సమన్వయం వంటి నాలుగు సూత్రాల అధారంగా వ్యాక్సిన్‌ పంపిణీపై నిర్ణయాలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.

వ్యాక్సినేషన్‌ కోసం సార్వజనీనంగా, అందుబాటు ధరలో ఉండేలా కార్యాచరణ చేపట్టాలని సమావేశంలో చర్చ జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ తయారీ, ఉత్పత్తి సామర్ధ్యాలపై రియల్‌ టైం పర్యవేక్షణ ఉండాలని కూడా ఈ అత్యున్నత సమావేశంలో నిర్ణయించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీలు కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ కనుగొనే పనిలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ దేశాల్లో వ్యాక్సిన్‌ ప్రయోగాలు కీలక దశకు చేరుకున్నాయి. ఇక ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఆస్ర్టాజెనెకా సంస్ధతో కలిసి అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

చదవండి : కరోనా టీకా: మరో కీలక అడుగు

మరిన్ని వార్తలు