వాళ్లే ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు: రిజిజు

28 Nov, 2015 09:07 IST|Sakshi
వాళ్లే ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు: రిజిజు

ఢిల్లీ: దేశంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల భావాలకు దక్షిణ భారత్‌కు చెందిన రాష్ట్రాల నుండి ముస్లింలు ఎక్కువగా ప్రభావితం అయ్యారని శుక్రవారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రిజిజు తెలిపారు. అయినంత మాత్రాన ఇతర ప్రాంతాలలో నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకపోలేదన్నారు. కేంద్రప్రభుత్వం తీవ్రవాదుల చర్యలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తుందని తెలిపారు.

ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని అంగీకరించాల్సిందేనని రిజిజు స్పష్టం చేశారు. ఉగ్రవాద దాడుల్లో కేవలం ఒకే ఉగ్రవాది పాల్గొని కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగించే అవకాశాలున్నాయన్న ఆయన ఈ తరహా దాడులు ఇండియాలో జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ముంబై దాడులు జరిగి ఏడు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. దేశంలో జరుగుతున్న ఇస్లామిక్ స్టేట్ కార్యకలాపాల పట్ల కేంద్ర హోంశాఖ అప్రమత్తంగా ఉందని రిజిజు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు