Rajasthan elections: బీజేపీ మేనిఫెస్టో విడుదల.. ఇది అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌: నడ్డా

16 Nov, 2023 18:08 IST|Sakshi

జైపూర్: రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 'సంకల్ప్ పత్ర' పార్టీ మేనిఫెస్టోని జైపూర్‌లో గురువారం విడుదల చేశారు. మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రకటించిన హామీలు ఇలా ఉన్నాయి..

  • పీఎం కిసాన్ సమ్మాన్ నిధి: ఈ పథకం కింద రైతులకు అందించే ఆర్థిక సహాయాన్ని సంవత్సరానికి రూ. 12,000 లకు పెంచుతామని పార్టీ ప్రకటించింది.
  • లాహో ఇన్సెంటివ్ స్కీమ్: ఈ పథకం పేద కుటుంబాల్లో బాలికలకు ఆర్థిక చేయూతను అందిస్తుంది. దీని కింద బాలికలు పుట్టినప్పుడు పొదుపు బాండ్ అందిస్తారు. ఈ  బాండ్ కాలక్రమేణా మెచ్యూర్‌ అవుతూ వస్తుంది. బాలిక ఆరో తరగతికి రాగానే రూ.26,000, తొమ్మిదో తరగతిలో రూ.18,000, పదో తరగతిలో రూ.10,000, 11వ తరగతిలో రూ.12,000, 12వ తరగతిలో రూ.14,000 అందజేస్తారు. ఇక వృత్తి విద్యలోకి అడుగుపెట్టాక రెండేళ్లలో రూ.50,000, 21 ఏళ్లు రాగానే రూ. 1 లక్ష చొప్పున అందిస్తారు.
  • ప్రత్యక్ష నగదు బదిలీ: దీని కింద ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులు స్కూల్ బ్యాగ్‌లు, పుస్తకాలు, యూనిఫాంలను కొనుగోలు చేయడానికి ఏటా రూ. 1,200 ఆర్థిక సాయం అందిస్తారు.
  • భామాషా హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్: ఆరోగ్య మౌలిక సదుపాయాల విస్తరణ, ఆధునీకరణ లక్ష్యంగా ఈ మిషన్‌లో రూ.40,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు బీజేపీ ప్రకటించింది.
  • స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్: పేపర్ లీక్ కేసులను త్వరితగతిన విచారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. 

అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌
మేనిఫెస్టో విడుదల సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ మేనిఫెస్టో అనేది ఇతర పార్టీలకు నామమాత్రపు వ్యవహారమని, కానీ బీజీపీ మేనిఫెస్టో అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌గా పనిచేస్తుందని పేర్కొన్నారు. అలాగే గత ఐదేళ్లలో కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టారు.

రాజస్థాన్‌లో నవంబర్ 25న అసెంబ్లీ ఎన్నికలు  జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 2013 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 163 సీట్లు గెలుచుకుని రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 200 మంది సభ్యులున్న సభలో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లు గెలుచుకుంది. చివరికి బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో గెహ్లాట్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

మరిన్ని వార్తలు