స్ప్రేల వల్ల కరోనా వైరస్‌ చస్తుందా!?

8 May, 2020 16:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా భారత్‌ సహా పలు దేశాల్లో వీధులను, బహిరంగ ప్రదేశాలను ‘బ్లీచ్‌’తో స్ప్రే చేస్తున్నారు. స్పెయిన్‌ దేశమైతే మరో అడుగు ముందుకేసి బీచ్‌లను కూడా ‘బ్లీచ్‌’తో శుభ్రం చేసింది. ఈ కార్యక్రమాలను విదేశాల్లో పారిశుద్ధ్య కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు నిర్వహిస్తుండగా భారత దేశంలో అక్కడక్కడ పారిశుద్ధ్య, ఆరోగ్య కార్యకర్తలతోపాటు ‘మేము సైతం’ అంటూ రాజకీయ నాయకులు కూడా నడుంగట్టారు. ( ఏడాది చివరి వరకు వర్క్ ఫ్రం హోమ్!)

ఇలాంటి స్ప్రేల వల్ల ప్రయోజనం ఏమిటీ ? కరోనా వైరస్‌ లాంటి మహమ్మారీని చంపేంత శక్తి ‘బ్లీచ్‌’కు ఉందా? ఉంటే దీని నుంచే కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టవచ్చుగదా! పోనీ దీనికి ఇతర వైరస్‌లు లేదా బ్యాక్టీరియాను చంపేంత శక్తి ఉందా ? బ్లీచ్‌ను స్ప్రే చేయడం వెనకనున్న అసలు ఉద్దేశం ఏమిటీ? బ్లీచ్‌లో ప్రధానంగా ఐదు శాతం ‘సోడియం హైపో క్లోరైట్‌’ ఉంటుంది. దీనికి బ్యాక్టీరియాను హరింపచేసే గుణం ఉంది. అందుకే తాగే నీటిలో దీన్ని  ఎక్కువగా కలుపుతుంటారు. వైరస్‌లను చంపుతుందనడానికి గ్యారంటీ లేదు. చంపే అవకాశముందున్న అంచనా మాత్రమే ఉంది. (గబ్బిలాలపై కరుణ ఎందుకు?)

చల్లటి వాతావరణంలో మూడు, నాలుగు నిమిషాలు మాత్రమే ప్రభావం చూపించే క్లోరిన్‌కు సూర్య రశ్మిలో, వేడి వాతావరణంలో ఒక్క నిమిషానికి మించి ప్రభావం చూపించదు. అంటే ఒక్క నిమిషం మాత్రమే దానికి వైరస్‌ను చంపే శక్తి ఉంటుందన్నమాట. అంటే నేరుగా బ్లీచ్‌ వెళ్లి వైరస్‌ల మీద పడినప్పుడే అవి చనిపోయే అవకాశానికి ఆస్కారం ఉన్నట్లు. మరి దీని వల్ల ప్రయోజనం ఏమిటీ ? (వూహాన్‌ ల్యాబ్‌ నుంచే వచ్చింది: పాంపియో)

ఈ విషయాన్ని ఆలోచించడానికి ముందు కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి ఎలా వ్యాపిస్తుందో మరోసారి గుర్తు చేసుకోవాలి. కరోనా రోగి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు శ్లేష్మం రెండు రకాలుగా బయటకు వస్తోంది. ఒకటి తేలికపాటి తుంపర్లు. అవి నేల మీద పడే లోగానే కొన్ని క్షణాల్లోనే గాల్లోనే ఆవిరవుతాయి. రెండు, నీటి బొట్టుల్లా పెద్దవి. అవి నేలమీద పడితే గరిష్టంగా మూడు గంటలపాటు ఉంటాయి. ఈ రెండు రకాల తుంపర్ల నుంచి కరోనా వైరస్‌ బయటకు వచ్చి పడుతుంది. అది పడిన ఉపరితలంను బట్టి దాని జీవితకాలం ఆధారపడి ఉంది. 

ప్లాస్టిక్, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌పైనా 72 గంటలు
ప్లాస్టిక్‌ మెటీరియల్‌, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఉపరితలాలపై కరోనా వైరస్‌ 72 గంటలపాటు బతికి ఉంటుంది. రాగిపై ఎనిమిది గంటలు, కార్డు బోర్డులపై నాలుగు గంటలపాటు మాత్రమే జీవించగలదు. ఈలోగా ఎవరైనా వైరస్‌ ఉన్న ప్రాంతంపై చేతులు పెడితే వారి చేతులకు అంటుకుంటుంది. వారు ఆ చేతులను ముక్కు, నోరు, కళ్లలో పెట్టుకున్నప్పుడే వైరస్‌ వారికి సోకుతుంది. అన్నింటికన్నా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి సులువుగా వ్యాపించేది పక్క పక్కన ఉన్నప్పుడే. రోగి తుమ్మినా, దగ్గినా, ఆ తుంపర్లు పక్కవారి మొహంపై పడి, తుడుచుకోవడం ద్వారా లేదా మరో రకంగానో నోరు, ముక్కు, కళ్ల ద్వారా లోపలికి పోతే సోకుతుంది. (అమెరికాలో లాక్డౌన్ ఎత్తివేత ఫలితం?)

కరోనా ఉపరితలాలు ఏమిటీ ?
రోగులు బస్సులు, రైళ్లలో పట్టుకునే తలుపులు, రాడ్లు, కూర్చునే సీట్లు, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో కూర్చునే సీట్లు, ఆసరాగా పట్టుకునే ఉపరి తలాలు, లిఫ్టుల్లో పట్టుకునే తలుపుల హ్యాండిల్స్, లిఫ్ట్‌ గోడలు, ఇంటి ముందు గోడులు కూడా (తుమ్మడం, దగ్గడం వల్ల). ఇంట్లో తలుపుల గొళ్లాలు, తాళాలు, ఆసరాగా చేతులు ఆన్చే ప్రాంతల్లోనే కరోనా వైరస్‌ ఉండే ఆస్కారం ఉంది. ఇక రోగులు పట్టుకున్న ప్రతి వస్తువు, సరకు మీద ఉండే అవకాశం ఉంది. రోగులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు లేదా ఉంచినప్పుడు మినహా కరోనా వైరస్‌ వీధుల్లో ఉండే అవకాశం లేదు. చెత్త కుప్పల వద్ద రోగుల ఇంటి నుంచి వచ్చే చెత్త వల్ల కొంత అవకాశం ఎక్కువ ఉంది. అయినా వీధుల్లో, చెత్త కుప్పలపై మూడు, నాలుగు గంటలకు మించి కరోనా బతికే అవకాశమే లేదు. పైగా కొన్ని నిమిషాలే ప్రభావం చూపించే బ్లీచ్‌లోని క్లోరిన్‌ వల్ల ప్రయోజనం ఏమిటీ? (కరోనా అనంతరం ప్రపంచం ఇలా మారనుంది...)

కరోనాను కట్టడి చేయడం కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు చెప్పడానికి, చూపించడానికి. తద్వారా ప్రజల్లో భరోసా కల్పిస్తూ వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి మాత్రమే. రోడ్ల మీద స్ప్రేల ద్వారా బ్లీచ్‌లను వధా చేయడానికి బదులు, రోడ్లపై ప్రజల కోసం అక్కడక్కడా బాడీ స్ప్రేలను ఏర్పాటు చేయడం ఇంకా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

(గమనిక : న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ అండ్‌ మెడిసిన్, న్యూసైంటిస్ట్, సైన్స్‌ డైరెక్టర్, సిడ్రాప్‌–సెంటర్‌ ఫర్‌ ఇన్‌ఫెక్సియస్‌ డిసీస్‌ రిసర్చ్‌ అండ్‌ పాలసీ, సీడీసీ–సెంటర్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్, సీఈఆర్‌సీ–క్రైసిస్, ఎమర్జెన్సీ రిస్క్‌ కమ్యూనికేషన్‌ వెల్లడించిన శాస్త్ర విజ్ఞాన అంశాల ఆధారంగా ఈ వార్తా కథనం)

>
మరిన్ని వార్తలు