రాఫెల్‌పై మోదీ సర్కారుకు క్లీన్‌చిట్‌

15 Nov, 2019 04:07 IST|Sakshi

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం..

రివ్యూ పిటిషన్లలో పస లేదంటూ కొట్టేసిన సుప్రీంకోర్టు

‘చౌకీదార్‌ చోర్‌ హై’ వ్యాఖ్యలపై రాహుల్‌కు మందలింపు

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి, ఫ్రాన్స్‌ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఎటువంటి అవకతవకలు జరగలేదు. గతంలో ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లలో ఎలాంటి పస లేదు. కాబట్టి గతంలో మేం కేంద్రానికి ఇచ్చిన క్లీన్‌చిట్‌కే కట్టుబడి ఉన్నాం. ఈ అంశంపై మోదీని ఉద్దేశించి రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు తప్పు.
     
36 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం.. దీనికి సంబంధించి ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం.. దీనికి అనుసరించిన విధానంలో ప్రభుత్వం తరఫున ఎలాంటి అవకతవకలు జరగలేదని గతేడాది డిసెంబర్‌ 14న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లు సహేతుకంగా లేవని తాజాగా గురువారం కొట్టివేసిన ధర్మాసనం.. దీనిపై గతంలో ఇచ్చిన తీర్పునకే కట్టుబడి ఉన్నట్టు ప్రకటించింది. రూ.58 వేల కోట్ల విలువైన ఒప్పందం చుట్టూ నెలకొన్న వివాదంపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలన్న అభ్యర్థనలను కూడా తిరస్కరించింది.

న్యూఢిల్లీ: రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో మోదీ ప్రభుత్వానికి మరోసారి ఊరట లభించింది. గతంలో ఇచ్చిన తీర్పుని పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లను విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రివ్యూ పిటిషన్లలో ఎలాంటి పస లేదని సుప్రీం స్పష్టంచేసింది. గతంలో కేంద్రానికిచ్చిన క్లీన్‌ చిట్‌కే కట్టుబడి ఉన్నట్టుగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ ఎస్‌కే కౌల్, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు ఇచ్చింది.

ఫ్రాన్స్‌కు చెందిన దసో ఏవియేషన్‌తో కుదుర్చుకున్న 36 రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం, దానికి అనుసరించిన విధానంలో ప్రభుత్వం తరఫున ఎలాంటి అవకతవకలు జరగలేదని 2018, డిసెంబర్‌ 14నే సుప్రీం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని పునఃసమీక్షించాలని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరి, లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లు సహేతుకంగా లేవని సుప్రీం స్పష్టంచేసింది. 58 వేల కోట్ల విలువైన ఒప్పందం చుట్టూ నెలకొన్న వివాదంపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలన్న అభ్యర్థనల్ని కూడా తిరస్కరించింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిన అంశాలేవీ అందులో లేవని న్యాయమూర్తులంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా జస్టిస్‌ కౌల్‌ తీర్పు చదివి వినిపించారు.

తీర్పుపై తాను ఏకీభవిస్తానని చెబుతూనే... కొన్ని అంశాల్లో తనకు వేరే అభిప్రాయాలు ఉన్నాయంటూ జస్టిస్‌ జోసెఫ్‌ విడిగా తీర్పు ఇచ్చారు. అందుకు గల కారణాలను వెల్లడించారు. మే 10న రివ్యూ పిటిషన్లపై తీర్పుని రిజర్వ్‌ చేసిన సుప్రీం కోర్టు... ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న అంతర్‌ ప్రభుత్వ ఒప్పందంలో (ఐజీఏ) సాంకేతిక సహకారం బదిలీని ఎందుకు చేర్చలేదని, ఒప్పందానికి సంబంధించి సార్వభౌమ పూచీకత్తుని ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా విచారణ సంస్థలు కేసుల్ని నమోదు చేయలేవని కోర్టుకు విన్నవించారు. ఇక టెక్నాలజీ బదిలీ వంటి అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని చెప్పారు.  

కాంగ్రెస్‌ క్షమాపణ చెప్పాలి: అమిత్‌ షా
రాఫెల్‌ ఒప్పందంపై సుప్రీం ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌ చేసిన దుష్ప్రచారానికి సరైన సమాధానమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. సుప్రీం తీర్పు వెల్లడయ్యాక ఆయన వరస ట్వీట్లు చేశారు. ఎన్డీయే ప్రభుత్వంపై, బీజేపీ నాయకులపై నిరాధార ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ నేతలందరూ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రాహుల్‌ జాగ్రత్తగా ఉండండి:  సుప్రీం కోర్టు చీవాట్లు
కోర్టు ధిక్కార కేసులన్నీ క్లోజ్‌  
రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ప్రధాని మోదీనుద్దేశించి చౌకీదార్‌ చోర్‌ హై (కాపలదారుడే దొంగ) అని వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టింది. రాహుల్‌ వ్యాఖ్యలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని, భవిష్యత్‌లో ఈ తరహా వ్యాఖ్యలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. రాఫెల్‌ ఒప్పందంలో అవకతవకలేవీ జరగలేదని కోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చిన తర్వాత కూడా అప్పట్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్‌ పదే పదే అదే వ్యాఖ్య చేసి ప్రధాని పరువు తీశారని, ఇదంతా కోర్టు ధిక్కారం కిందకి వస్తుందని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి రాహుల్‌కు వ్యతిరేకంగా కేసు వేశారు. దీన్ని విచారించిన ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగాయ్, జస్టిస్‌ ఎస్‌కే పాల్, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ రాహుల్‌ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘రాజకీయాల్లో కీలకమైన హోదా అనుభవిస్తున్న రాహుల్‌ వాస్తవాలు పరిశీలించకుండా ప్రధానికి వ్యతిరేకంగా మాట తూలడం దురదృష్టకరం’అని వ్యాఖ్యానించారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలు కోర్టు తీర్పునుద్దేశించి చేసినవి కాదని, అవి పూర్తిగా రాజకీయ వ్యాఖ్యలని గతంలోనే రాహుల్‌ అఫడివిట్‌ దాఖలు చేశారు. ఇప్పుడు రాహుల్‌ కోర్టుకి బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో ధిక్కార కేసుల్ని మూసివేస్తున్నట్టుగా న్యాయమూర్తులు ప్రకటించారు.

రాఫెల్‌పై విచారణ జరపాల్సిందే: రాహుల్‌
రాఫెల్‌ ఒప్పందంపై తీర్పు వెలువరించిన జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ పేర్కొన్న అంశాల ఆధారంగా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి పేర్కొన్నారు. ‘సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జోసెఫ్‌ పేర్కొన్న అంశాలు రాఫెల్‌ కుంభకోణంపై విచారణకు మార్గం చూపాయి. దీనిపై ఇప్పుడు దర్యాప్తు పూర్తిస్థాయిలో జరగాలి. ఈ స్కాంపై జేపీసీ కూడా వేయాలి’అని గురువారం ఆయన ట్విట్టర్‌లో డిమాండ్‌ చేశారు. రాఫెల్‌ ఒప్పందం విషయంలో బీజేపీ ప్రజలను మోసం చేస్తోందని, సుప్రీంకోర్టు తీర్పుతో పండగ చేసుకోవడం మాని విచారణపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్‌ ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా కోరారు.  

కాంగ్రెస్‌ సంధించిన ప్రశ్నలు
1. జాతీయ భద్రతా ముసుగులో యుద్ధ విమానాల ధరను వెల్లడించకపోవడం ఎంతవరకు సరైనది ? ధర తడిసిమోపెడవడానికి కారణాలేంటి ?  
2. రిలయెన్స్‌ను ఆఫ్‌సెట్‌ భాగస్వామిగా ఎంచుకోవాల్సిన అవసరం ఏమిటి ?
3. దేశీయ విమానాల తయారీ సంస్థ హాల్‌ను ఎందుకు పక్కన పెట్టారు ?  
4. ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో పరిణామాలు ఎలా జరిగాయి ?

మరిన్ని వార్తలు