గిరిజనుల సంక్షేమానికి రూ.24,000 కోట్ల పథకం 

15 Nov, 2023 04:02 IST|Sakshi

మోదీ గ్యారంటీల ముందు కాంగ్రెస్‌ హామీలు పని చేయవు  

మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి  

బేతుల్‌: గిరిజనుల సంక్షేమ కోసం రూ.24,000 కోట్లతో కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన మంగళవారం మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని పునరుద్ఘాటించారు. తమ పార్టీ సభలకు జనం భారీ ఎత్తున తరలివస్తున్నారని చెప్పారు.

మధ్యప్రదేశ్‌లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు తమ పార్టీ పట్ల అపూర్వమైన విశ్వాసం, మమకారం చూపుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. బుధవారం ‘జనజాతీయ గౌరవ్‌ దివస్‌’ను జరుపుకోబోతున్నామని, జార్ఖండ్‌లో భగవాన్‌ బిర్సాముండాకు నివాళులు అరి్పంచబోతున్నానని తెలిపారు. గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా రూ.24,000 కోట్ల పథకాన్ని ప్రటించనున్నట్లు వివరించారు.  

మోదీ ఇస్తున్న గ్యారంటీ  
మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పరాజయాన్ని ఇప్పటికే అంగీకరించిందని ప్రధాని మోదీ చెప్పారు. మోదీ గ్యారంటీల ముందు కాంగ్రెస్‌ నకిలీ హామీలు పని చేయవని తేల్చిచెప్పారు. ఆ విషయం కాంగ్రెస్‌కు కూడా తెలుసని అన్నారు. ఆ పార్టీ ఇక అదృష్టాన్ని నమ్ముకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు, త్రిపుల్‌ తలాఖ్‌ రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం గురించి కాంగ్రెస్‌ ఏనాడూ ఆలోచించలేదని తప్పుపట్టారు. వాటన్నింటినీ తమ ప్రభుత్వం ఆచరణలో చేసి చూపించిందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్ఛిన హామీలన్నీ కచ్చితంగా అమలు చేస్తామని, ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ అని  వ్యాఖ్యానించారు.  

మూర్ఖుల సర్దార్‌ రాహుల్‌ గాంధీ  
ప్రజల జేబుల్లో ‘మేడ్‌ ఇన్‌ చైనా’ఫోన్లు మాత్రమే కనిపిస్తున్నాయంటూ కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ తిప్పికొట్టారు. మొబైల్‌ ఫోన్ల తయారీలో మన దేశం ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుకుందని వెల్లడించారు. అలాంటి మూర్ఖుల సర్దార్‌ ప్రపంచంలో ఉంటారా? అని రాహుల్‌పై మండిపడ్డారు. భారత్‌ నుంచి ఏటా రూ.లక్ష కోట్ల విలువైన ఫోన్లు ఎగుమతి అవుతున్నాయని చెప్పారు.

ఆకాశంలో విహరిస్తున్న కాంగ్రెస్‌ నాయకులకు వాస్తవాలు ఏమిటో తెలియవని ఎద్దేవా చేశారు. మన దేశం సాధిస్తున్న విజయాలను కళ్లతో చూడలేని జబ్బు వారికి ఉందని విమర్శించారు. భారత్‌ వోకల్‌ ఫర్‌ లోకల్‌గా మారిందన్నారు. స్వదేశీ ఉత్పత్తులు మార్కెట్లను ముంచెత్తుతున్నాయని, ఈ పరిణామంపై వ్యాపార, వాణిజ్య వర్గాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయని ప్రధానమంత్రి వెల్లడించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే విధ్వంసమే మిగులుతుదందని ఓటర్లను అప్రమత్తం చేశారు.

మరిన్ని వార్తలు