ఖురేషీ దెబ్బకు ముగ్గురు సీబీఐ చీఫ్‌లు ఔట్‌! 

13 Jan, 2019 02:55 IST|Sakshi

సీబీఐ అధిపతి ఆలోక్‌ వర్మ ఉద్వాసనతో మాంసం వ్యాపారి మొయిన్‌ అక్తర్‌ ఖురేషీ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఖురేషీకి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసు అటు తిరిగి ఇటు తిరిగి ఆలోక్‌ వర్మ ఉద్యోగానికి ఎసరు పెట్టింది. ఖురేషీ నుంచి లంచం తీసుకున్నారంటూ సీబీఐలో నంబర్‌ 1, 2 స్థానాల్లో ఉన్న అధికారులు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం, దాంతో కేంద్రం వర్మను సెలవుపై పంపడం, చివరికి ఆయనకు ఉద్వాసన చెప్పడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఖురేషీ కేసు దెబ్బకు గతంలో సీబీఐ చీఫ్‌లుగా పనిచేసిన ఏపీ సింగ్, రంజిత్‌ సిన్హాలు కూడా పదవుల నుంచి వైదొలగాల్సి వచ్చింది. 

కాన్పూర్‌కు చెందిన ఖురేషీ 1993లో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో మాంసం ఎగుమతి వ్యాపారం ప్రారంభించాడు. అధికారంలో ఉన్నవారితో సత్సంబంధాలు నెరపడం ద్వారా అనేక అక్రమాలకు పాల్పడి అనతికాలంలోనే కోటీశ్వరుడయ్యాడు. దుబాయ్, లండన్, ఐరోపాల్లో హవాలా వ్యాపారం చేసేవాడు. పన్ను ఎగవేత నుంచి మనీ లాండరింగ్‌ వరకు ఆయనపై బోలెడు కేసులు నడుస్తున్నాయి. ఈ కేసుల నుంచి బయటపడటం కోసం సీబీఐ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకునేవాడు. కేసులు లేకుండా చేస్తానని చెప్పి సీబీఐ అధిపతుల పేరుతో పలువురి నుంచి కోట్లు రాబట్టేవాడు. ఖురేషీ కేసుకు సంబంధించి ఆలోక్‌వర్మ రూ.2 కోట్లు లంచం తీసుకున్నారని మరో అధికారి రాకేశ్‌ అస్తానా ఆరోపించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చివరికది వర్మ ఉద్వాసనకు దారితీసింది. 

2014లో సీబీఐ అధిపతిగా ఉన్న రంజిత్‌ సిన్హా ఇంటికి ఖురేషీ పదే పదే వెళ్లారని, 15 నెలల్లో 70 సార్లు ఖురేషీ సిన్హాను కలిశారని వార్తలు వచ్చాయి. సీబీఐ కేసులో ఇరుక్కున్న తన స్నేహితుడికి బెయిలు రావడం కోసం తాను రంజిత్‌ సిన్హా ద్వారా ఖురేషీకి కోటి రూపాయలు ఇచ్చానని హైదరాబాద్‌కు చెందిన సానా సతీశ్‌బాబు ఈడీ విచారణలో వెల్లడించాడు. ఈ ఆరోపణలను సిన్హా ఖండించినప్పటికీ చివరికి పదవి నుంచి వైదొలగక తప్పలేదు. 

2010–12 మధ్య సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న ఏపీ సింగ్, ఖురేషీ చాలాసార్లు సెల్‌ మెసేజ్‌ల ద్వారా సంభాషించుకున్నారని 2014 చివర్లో ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఖురేషీ, సింగ్‌ల మధ్య సంబంధాలపై దర్యాప్తు జరపడం కోసం సీబీఐ సింగ్‌పై కేసు నమోదు చేసింది. ఫలితంగా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు