మరో రెండు వారాలు లాక్‌డౌన్..!

11 May, 2020 20:31 IST|Sakshi

ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రులు‌

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించాలని అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు మరింతగా సడలిస్తే కరోనా వ్యాప్తి ఎక్కువయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా అమలు అవుతున్న లాక్‌డౌన్‌ గడువు మే 17తో ముగియనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  ఈ సందర్భంగా సర్బానంద సోనోవాల్‌ మాట్లాడుతూ.. ‘‘అంతరాష్ట్ర కార్యకలాపాలు ప్రారంభిస్తున్న తరుణంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. అదే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి అసోంకు వారానికి ఒకే రైలు వచ్చే విధంగా చూడాలి. వైరస్‌ విస్తరిస్తున్న తరుణంలో జాగ్రత్తపడటం అవసరం’’ అని మోదీతో పేర్కొన్నారు.(అప్పుడే సాధారణ పరిస్థితులు: ప్రధానితో సీఎం జగన్‌)

ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏమన్నారంటే... 
ప్యాకేజీ ప్రకటించాలి: పినరయి విజయన్‌
ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో కేరళ సీఎం పినరయి విజయన్‌ మాట్లాడుతూ.. రోడ్డు, రైళ్లు, విమానాల సర్వీసులను కచ్చితంగా పునరుద్ధరించాలని పేర్కొన్నారు. అయితే సామాజిక ఎడబాటు, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో మెట్రో రైళ్లు, బస్సులు నడిపేందుకు అనుమతినివ్వాలని కోరారు. సూక్ష్మ, చిన్న, తరహా తరగతి పరిశ్రమలకు ప్యాకేజీ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. (అది మానవుడి సహజ లక్షణం: మోదీ)

అక్కడ రెండో దశ.. జాగ్రత్తగా ఉండాలి
జూన్‌ లేదా జూలై నాటికి కరోనా పాజిటివ్‌ కేసులు శిఖరస్థాయికి చేరుకునే అవకాశం ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అభిప్రాయపడ్డారు. వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో లాక్‌డౌన్‌ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉందని అన్నారు. అయితే ముంబైలో నిత్యావసరాల కోసం స్థానిక రైళ్లను నడిపేందుకు అనుమతినివ్వాలని కోరారు. ‘‘వుహాన్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత రెండో దశ ప్రారంభమైనట్లు నేను చదివాను. ఈ విషయం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరించింది. కాబట్టి మనం మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలి’’అని ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యానించారు.(రైళ్లను ఇప్పుడే పునరుద్దించవద్దు: ప్రధానితో సీఎం కేసీఆర్‌)

సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాం
ఆర్థిక కార్యకలాపాల విషయంలో రాష్ట్రాలకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే వెసలుబాటు కల్పించాలని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్‌ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. అదే విధంగా కరోనా తీవ్రతను బట్టి గ్రీన్‌, రెడ్‌, ఆరెంజ్‌ జోన్లను విభజించే అధికారం కూడా రాష్ట్రాలకే వదిలేస్తే బాగుంటుందన్నారు.

ఇక పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు చేస్తూనే ఆర్థిక వ్యవస్థను పునురుద్ధరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. 

మే 31 వరకు రైళ్లు, విమానాలు వద్దు
‘‘మే 12 నుంచి ఢిల్లీ నుంచి చెన్నైకి రెగ్యులర్‌గా రైళ్లు నడుపబోతున్నారని మీడియా ద్వారా తెలుసుకున్నాం. చెన్నైలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి మే 31 వరకు రాష్ట్రంలోకి విమాన, రైలు సర్వీసులను నిలిపివేయండి’’అని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి ప్రధాని మోదీని కోరారు. 


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు