అలరించిన నరాల రామారెడ్డి అష్టవధానం

10 Jul, 2018 13:17 IST|Sakshi

ఫిలడెల్ఫియా : ఫిలడెల్ఫియాలో జరుగుతున్న నాటా సభల్లో నరాల రామారెడ్డి అష్టవధానం అందరిని ఆకట్టుకుంది. నాటా కన్వెన్షన్‌ 2018 లిటరరీ కమిటీ ఛైర్‌ జయదేవ్‌ మెట్టుపల్లి నరాల రామారెడ్డిని వేదికపైకి  
ఆహ్వానించగా, సభాధ్యక్షత వహించిన డా. వడ్డేపల్లి కృష్ణ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నేత లక్ష్మీపార్వతి గౌరవఅతిథిగా హాజరయ్యారు. దత్త పదిగా తానా, ఆటా, నాటా, అమెరికా అను పదాలతో భారతార్థంలో గూడూరి శ్రీనివాస్‌ పృచ్ఛకునిగా శార్దూల వృత్తాన్ని కోరగా అవధాని చమత్కారంగా పూరించారు. 'రంగమ్మ నిను వీడ జాలనియోన్‌ రాముడు విభ్రాంతుండై' అన్న సమస్యను డా. పుట్టపర్తి నాగపద్మిని ఇవ్వగా 'సారంగమ్మా' అను సంభోధనతో అవధాని మాయలేడిని వర్ణిస్తూ సమస్యను పూరించి సభికుల్ని ఆనందంలో ముంచెత్తారు. 

మిగతా పృచ్ఛకులుగా వర్ణన- జయదేవ్‌, ఆశువు-డా. ఆడువాల సుజాత, న్యస్తాక్షరి- అశోక్‌, ఘంటసాల-ఆదినారాయణ, అప్రస్తుత ప్రసంగం- సదాశివ రాంపల్లి నిర్వహించారు. నాటా అధ్యక్షులు గంగసాని రాజేశ్వరరెడ్డి అవధాని డా. నరాల రామారెడ్డి, పృచ్ఛకులందరినీ శాలువాతో సన్మానించారు. 

మరిన్ని వార్తలు