'హోదా' కోసం ప్రవాసాంధ్రుల మౌన నిరసన

16 Apr, 2018 10:58 IST|Sakshi

వాషింగ్టన్ డీసీ : ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకహోదాకి మద్దతుగా వైఎస్సార్‌సీపీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో అమెరికాలోని వివిధ నగరాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీ వర్జీనియాలోని ఫ్రైయింగ్ పాన్ ఫార్మ్ పార్కులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఫ్లకార్డులతో మౌనంగా తమ నిరసన వ్యక్తం చేశారు. ఎన్‌ఆర్‌ఐలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలపై ధ్వజమెత్తారు. ఆనాడు రాష్ట్రాన్ని విడగొట్టి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే ఈనాడు హామీనిచ్చి ప్రత్యేకహోదా ఇవ్వకుండా కేంద్రప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా ఇస్తామని బీజేపీ, తెస్తామని టీడీపీ ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకుని, ఇప్పుడు ప్యాకేజీ మేలు అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. గత నాలుగు సంవత్సరాలుగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఒక్కరే ప్రత్యేకహోదా కోసం నిరంతరం పోరాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. వైఎస్సార్‌సీపీ అనేక పద్ధతుల్లో ప్రత్యేకహోదా కోసం  పోరాటాలు చేసి, చివరికి వైఎస్సార్‌సీపీ ఎంపీలతో రాజీనామా కూడా చేసి ఆమరణనిరాహారదీక్ష చేయటం అభినందనీయమని ఎంపీలకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 


చంద్రబాబు చేస్తున్న కుంభకోణాలు, మోసాలు, కేసులనుండి తప్పించుకోవటానికే కేంద్రంతో కుమ్మక్కయి రాష్ట్రానికి అన్యాయం చేస్తూ హోదాని తాకట్టు పెట్టారని ఎన్‌ఆర్‌ఐలు నిప్పులు చెరిగారు. చంద్రబాబు జీవితంలో ఎప్పుడూ ప్రజలకి ఒక్క మంచి పని కూడా చేయలేదని, ఆనాడు పిల్లనిచ్చిన మామకే వెన్నుపొడిచి ముఖ్యమంత్రి అయ్యాడని ఈరోజు కేసులనుండి తప్పించుకోవటం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వెన్నుపోటు పొడుస్తున్నాడన్నారు. ఇప్పటికైనా తెలుగు ప్రజలు నిజాలు తెలుసుకొని రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంకోసం నిరంతరం పోరాడుతున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని బలపరిచి అన్ని ఎంపీ సీట్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విజ్ఞప్తి చేశారు. 

ఈ నిరసన దీక్షలో రమేష్ రెడ్డి వల్లూరు, శశాంక్ అరమడక, అమర్నాథ్ కటికరెడ్డి, మదన్ గల్లా, ఇంతియాజ్ పఠాన్, శ్రీనివాసరెడ్డి గొప్పన్నగిరి, కిషోర్ జొన్నలగడ్డ, అర్జున్ కామిశెట్టి, శివ వంకిరెడ్డి, వెంకటమణిదీప్ కొత్తా, చంద్రతేజా రెడ్డి, శ్రీధర్ నాగిరెడ్డి, నినాద్ అన్నవరం, సతీష్ నరాల, వెంకట రాజా రెడ్డి, శ్రీనివాస రెడ్డి, వెంకటరమణారెడ్డి లతోపాటుగా పలువురు తెలుగువాళ్లు పాల్గొన్నారు. తీవ్ర చలిగాలులతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నా పెద్ద ఎత్తున తెలుగు వారు వచ్చి ప్రత్యేకహోదాకి మద్దతు తెలిపినందుకు వైఎస్సార్‌సీపీ నాయుకులు వల్లూరి రమేష్ రెడ్డి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

మరిన్ని వార్తలు