ఘనంగా మనబడి స్నాతకోత్సవం

20 May, 2018 10:49 IST|Sakshi

క్యాలిఫోర్నియా : సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. అమెరికాలో క్యాలిఫోర్నియా నగరంలోని ఇండియన్‌ కమ్యూనిటీ సెంటర్‌లో శుక్రవారం మనబడి సం‍స్థ నిర్వహకులు ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలుగు యూనివర్శిటీ ఉపాధ్యక్షులు ఆచార్య ఎస్‌వీ సత్యనాయరణ చేతుల మీదుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంతో మనబడి కలిసి నిర్వహించిన జూనియర్‌, సీనియర్‌ సర్టిఫికేట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 300 మంది విద్యార్థులకు ద్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేలమైళ్ల దూరంలో ఉన్నా, మాతృభాషపై మమకారంతో తెలుగు భాష నేర్చుకుంటున్న చిన్నారులను, వారిని ప్రోత్సహస్తున్న తల్లిదండ్రులను అభినందించారు.

మనబడి అధ్యక్షుడు రాజు చమర్తి మాట్లాడుతూ.. మొత్తం 1857 మంది విద్యార్థులుకు గాను 1830 మంది ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. అందులో 68.6 శాతం మంది డిస్టింక్షన్‌లో, 20.4 శాతం మంది ఫస్ట్‌ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించారని అన్నారు. మిగతా విద్యార్థులకు డాల్లస్‌, చికాగో, అట్లాంటా, వర్జీనియా, న్యూజెర్సీ నగరాలలో జరగనున్న మనబడి స్నాతకోత్సవాలలో ఎస్‌వీ సత్యనారయణ చేతుల మీదుగా అందజేయనున్నట్టు తెలపారు. పరీక్షల నిర్వహణలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. 2018-19 విద్యాసంవత్సరానికి గాను నమోదు కార్యక్రమం ప్రారంభమైనట్లు వెల్లడించారు. 

విద్యార్థులు మనబడి వెబ్‌సైట్‌ ద్వారా ఆగస్టు 30వ తేది లోగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సిలికానాంధ్ర సంస్థాపక అధ్యక్షుడు ఆనంద్‌ కూచిబొట్ల మాట్లాడుతూ.. కేజీ నుంచి పీజీ దాకా విద్యాబోధనే ధ్యేయంగా ఏర్పాటు చేసిన మనబడి, సిలికానాంధ్రకు తెలుగు విశ్వవిద్యాలయం తోడు కావడం సంతోషకరమైన విషయమన్నారు. భారత్‌లో నిర్మిస్తున్న సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి కార్యాచరణను ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మనబడి ఉపాధ్యక్షుడు దీనబాబు కొండుభట్ల, తెలుగు యూనివర్శిటీ అధికారులు ఆచార్య రమేష్‌ భట్టు, ఆచార్య రెడ్డి శ్యామల, డా.గీతా వాణి, సిలికానాంధ్ర ఉపాధ్యక్షుడు దిలీప్‌ కొండిపర్తి, శాంతి కూచిబొట్ల, శ్రీదేవి గంటి, మనబడి బృంద సభ్యులు శ్రీరాం కోట్ని, శిరీష చమర్తి, శ్రీవల్లి కొండుభట్ల, కృష్ణ జయంతి, సాయి కందుల, లక్ష్మి యనమండ్ర తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు