ఘనంగా వైఎస్సార్‌సీపీ ఎన్నారై విభాగం 9వ ఆవిర్భావ వేడుకలు

15 May, 2019 21:01 IST|Sakshi

వాషింగ్టన్ : వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎన్నారై విభాగం 9వ ఆవిర్భావ వేడుకలు (ఏప్రిల్‌ 30, 2011లో ఆవిష్కరణ) వర్జీనియాలోని పెర్సిస్ (బంజారా) ఇండియన్ గ్రిల్, అష్బర్న్ సిటీలో ఘనంగా జరిగాయి.  ఏనిమిది వసంతాలు పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలో అడుగు పెట్టిన  సందర్భంగా వాషింగ్టన్ డిసి మెట్రో ప్రాంతములో వైఎస్సార్‌సీపీ సలహాదారు, గవర్నింగ్ కౌన్సిల్ (యూఎస్‌ఏ) వల్లూరు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇండియా నుంచి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో న్యూజెర్సీ నుంచి గురజాల మాజీ ఎమ్మెల్యే మందపాటి నాగి రెడ్డి మనువడు శరత్ మందపాటి, నాటా నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

మొదటగా వైఎస్సార్‌సీపీ నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫోటోకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సభకు విచ్చేసిన ముఖ్య అతిధిని శాలువా, పుష్పగుచ్చాలతో వాషింగ్టన్ డీసీ మెట్రో పార్టీ ఎన్నారైలు సత్కరించారు. అనంతరం ఆంజనేయ రెడ్డి అతిధులను సభకు పరియం చేసి సభ యొక్క ఆవశ్యకతను గురించి వివరించారు. 

ఈ సందర్భంగా ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీడీపీతో చేతులు కలిపి వైఎస్‌ జగన్‌పై అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైలుకు పంపినా అధైర్యపడకుండా ప్రజా సంక్షేమం కొరకు పోరాడుతున్నారని ప్రశంసించారు. 2014 ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను, లోక్‌ సభ సభ్యులను సంతలో పశువుల్లా కొనుగోలు చేసినా అదరకుండా, బెదరకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారన్నారు. మే 23 తర్వాత భారీ మెజారిటితో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని, మళ్లీ రాజన్న రాజ్యం చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నీతి మాలిన ప్రభుత్వానికీ చరమ గీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు.   

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన నుంచి ప్రజలను కాపాడాలంటే వైఎస్‌ జగన్‌ ఏపీ ముఖ్యమంత్రి కావాలన్నారు. వైఎస్‌ జగన్‌ పాలనకై ఆంధ్ర ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారని, వైఎస్‌ జగన్‌ను సీఎం చేసే బాధ్యత ప్రవాసాంధ్రుల అందరిపై ఉందన్నారు. అమెరికా లో ఉన్న ప్రతి వైఎస్సార్‌ అభిమాని, పార్టీ కార్యకర్తలు తమ నియోజకవర్గాలకు వెళ్లి పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసినందుకు ధన్యవాదములు తెలిపారు. వీలు కాని వాళ్లు ఫోన్‌ ద్వారా తమ కుటుంబ సభ్యలకు, సోషల్ మీడియా  ద్వారా ఓటర్లను ప్రభావితం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

రమేష్ రెడ్డి మాట్లాడుతూ..‘ విశ్వసనీయతే మన బలం, ఎన్నికల్లో చేతకాని హామీలిచ్చి తీరా అధికారమొచ్చాక మాట తప్పి నమ్మి ఓట్లేసిన ప్రజలను మోసం చేయడం బాబు నైజం, ఒక మాటంటూ ఇస్తే ఆ మాట కోసం ఎందాకైనా వెళ్ళడం మన నాయకుడు వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ఇజం. మాట తప్పం, మడమ తిప్పం..ఇదే వైఎస్సార్‌ మనకు నేర్పిన సిద్ధాంతం’ అన్నారు. 2019 ఎన్నికల ఫలితాలలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురు తుందని ఘంటాపథంగా అన్నారు. కలిసికట్టుగా ప్రయాణం చేసి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కలలుగన్న సువర్ణయుగాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెర్సిస్ ఇండియన్ గ్రిల్ ఓనర్ శ్రీనివాస్ గొలుగూరి అందరికి కమ్మనైన విందు భోజనాన్ని పంచారు. ముఖ్యంగా వర్జీనియా, మేరీలాండ్, న్యూ జెర్సీ, నార్త్ కరోలినా, డెలావేర్, వాషింగ్టన్ డి.సి. ప్రాంతాల నుంచి దాదాపు 200 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు