-

గాడ్‌ఫాదర్ అనుసృజన నా తలరాత కావచ్చును!

11 Oct, 2015 04:58 IST|Sakshi
గాడ్‌ఫాదర్ అనుసృజన నా తలరాత కావచ్చును!

‘సంక్షిప్తం’గానే కావొచ్చు, క్షమించలేనన్ని అక్షర దోషాలతోనే కావొచ్చు, కానీ ప్రభావవంతంగానే  ‘గాడ్‌ఫాదర్’ (మేరియో ఫ్యూజో) తెలుగులోకి వచ్చాడు. దాన్ని సాధ్యం చేసిన మూర్తి కె.వి.వి.ఎస్.తో ‘సాక్షి సాహిత్యం ప్రతినిధి’ జరిపిన చిరు సంభాషణ:
 
 ఈ గాడ్‌ఫాదర్ మీకు ఎప్పుడు పరిచయమయ్యాడు?
 ఇరవై ఏళ్ల కిందట! నాకు మొదటి నుంచి వివిధ రాష్ట్రాలకి ఒంటరిగా రైలు ప్రయాణాలు చేయడం అభిరుచి. రైల్వేస్టేషన్లో ఏదో ఒక నవల కొని ఆ ప్రయాణం అయ్యేలోపు చదివి, దాని గురించి డైరీలో ముఖ్యమైన విషయాలు రాసుకునేవాడిని. ఆ క్రమంలోనే గాడ్‌ఫాదర్‌ని కూడా చదివాను.
 
 చదివినప్పుడు అది కలిగించిన ప్రభావం?
 ఆ శైలీ, విషయమూ, పాత్రల్ని మలిచిన తీరూ విస్మయపరిచింది. నమ్మకద్రోహం, స్నేహశీలత, జంతువు వంటి పోరాట స్వభావం, ఇట్లా మనిషిలోని సకల కోణాల్ని అత్యంత ఉత్కంఠభరితంగా ఫ్యూజో చిత్రించాడు. కొన్ని సినిమాలకి సరిపడా ముడి సరుకు లభ్యమవుతుంది. మన దర్శకులు ఆ కోణంలో బాగానే వాడుకున్నారు. అసలు డాన్ అనే మాట మామూలుది కాదు. దాని వెనుక ఎంత బరువు ఉంటుంది అనేది నవల చదవకపోతే ఎప్పటికీ తెలియదు. చాలామంది బండకొట్టుడుగా ఒక దొంగల నాయకుడిగా భావిస్తారు.
 అనువాదం ఎందుకు చేయాలనిపించింది?
 
 ఒక ఆంగ్ల నవల ఆత్మని సాధ్యమైనంత ఎక్కువగా తెలుగులోకి వంపాలనిపించి! సమాజంలోని వివిధ ఆధిపత్య వర్గాలు నిరంతరం తమ సంపద, అధికారం కాపాడుకోవడానికి ఎలాంటి పద్ధతుల్ని అవలంబిస్తుంటారు, ఎలా ఇచ్చిపుచ్చుకునే వ్యూహాల్ని పాటిస్తుంటారు, ఇట్లా అనేక విషయాలు మనకి  అవగతమవుతాయి. ఇవన్నీ మన సమాజంలోని కొన్ని కోణాల్ని స్పృశించినట్లు అనిపించినా ఆశ్చర్యం లేదు. నిజానికివన్నీ మనం తెలుసుకున్నవే కాని ఒక క్రమపద్ధతిలో ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ చెప్పే విధానం  మైమరిపిస్తుంది. మనం గుప్పిటిలో పట్టి ఉంచిన కొన్ని విషయాల్ని బద్దలుగొట్టినట్లు చెబుతాడు ఫ్యూజో.
 ఈ అనువాదానికి మీరుగా అనుసరించిన పద్ధతి ఏమైనా ఉందా?
 
 కొన్ని ప్రభావవంతమైన వాక్యాల్ని, మాటల్ని ఆంగ్లంలోనే ఉంచేశాను. వాటిని ఆ భాషలో చదివితేనే మజా! దెబ్బ ఎక్కడ తగలాలో అక్కడ తగిలి అబ్బా అనిపిస్తుంది. మక్కీకి మక్కీగా ఏవో పదాల్ని తెలుగులో అక్కడ పెట్టవచ్చును. కాని ఆ కిక్ రాదు గాక రాదు. అయినా ఒక ఆంగ్ల అనువాదాన్ని ఎవరు చదవాలనుకుంటారు! ఎంతో ఒకంత ఆంగ్లంలోని రుచి తెలిసినవారే చదవాలనుకుంటారు.
 
 ఇది ఇంతవరకూ తెలుగులోకి ఎందుకు రాలేదనుకుంటున్నారు?
 ఎందుకు ఇంతకాలం ఎవరూ ఈ మాస్టర్ క్లాసిక్‌ని తెలుగులోకి తేలేదు అని యోచిస్తే నాకు తేలింది ఒకటే. డాన్ Vito Corleone D నవల్లో అన్నట్లు ‘ప్రతి మనిషికి ఒక తలరాత ఉంటుంది. దాన్నెవరూ మార్చలేరు’. బహుశా ఈ అనుసృజనని నేను చేయాలనేది నా తలరాత కావచ్చును!
 మూర్తి కె.వి.వి.ఎస్. ఫోన్: 7893541003
 - మూర్తి కె.వి.వి.ఎస్.

మరిన్ని వార్తలు