-

ఓటమిని ఒప్పుకోవడమే క్రీడాస్ఫూర్తి

27 Nov, 2023 00:27 IST|Sakshi
ఆస్ట్రేలియాతో వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌లో విరాట్‌ కోహ్లీ, గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌లో తనను ఓడించిన మెద్వెదేవ్‌తో జొకోవిచ్‌ (తెల్ల చొక్కా)

కామెంట్‌

పది వరుస విజయాల తర్వాత ప్రపంచ కప్‌ ఫైనల్‌లో ఓడిపోవడం హఠాత్ఘాతమే. తట్టుకోలేని దెబ్బే. అయితే అది ఒక వ్యక్తి ప్రవర్తనను, ప్రవర్తన విధానాన్ని ప్రభావితం చేసినందువల్ల... అతడిలో మనం ఆశించిన సౌమ్యతను, మర్యాదను అతడు విస్మరిస్తే దానిని మనం చూసీ చూడనట్లు వదిలేయాలా? 2021 యు.ఎస్‌. టెన్నిస్‌ ఓపెన్‌ మెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్‌... నొవాక్‌ జొకోవిచ్‌కి చాలా పెద్ద మ్యాచ్‌. అతడు ఆ మ్యాచ్‌ని గెలిస్తే ఒకే ఏడాదిలో మొత్తం నాలుగు గ్రాండ్‌ స్లామ్‌లలోనూ విజయం సాధించినట్లు అవుతుంది. అద్భుతంగా ఆడాడు. కానీ ఓడిపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయినప్పటికీ మెద్వెదేవ్‌ను మనస్ఫూర్తిగా అభినందించాడు. మన క్రికెటర్లు తమ ఓటమిని హూందాగా ఎలా స్వీకరించాలో నేర్చుకోవలసే ఉంది.

పెద్దమనిషి అని ఒకర్ని అంచనా వేయడానికి ఉన్న అనేకమైన మార్గాలలో బహుశా అత్యంత సునిశి తమైనది... వారు ఓటమిలో సైతం సహజ నిశ్చల శాంత గాంభీర్యాన్ని కలిగి ఉండటమేనని నేను చెప్పగలను. ఇక ఆ పెద్దమనిషి క్రీడాకారుడు అయితే కనుక ఓటమిలోని అతడి నిశ్చలతకు మరింతగా ప్రాముఖ్యం ఉంటుంది. ఏదైనా మీరు తీవ్రంగా కోరుకున్నదీ, ‘మన చేతుల్లో పనే’ అనేంతగా మీరు తిరుగులేని నమ్మకంతో ఉన్నదీ... ఊహించని విధంగా మీ పట్టు నుంచి జారి, మిమ్మల్నొక కలలు కల్లలైన పరాజితునిగా మిగిల్చినప్పుడు మీ కదలి కలు, మీ కవళికలు ఎలా ఉంటాయన్నది మీ వ్యక్తిత్వంలోని నాణ్యత పాలును పైకి తేలుస్తుంది. 

గత ఆదివారం ఓటమి అనంతరం మన క్రికెట్‌ జట్టు నిలదొక్కుకోలేక పోయిన పరీక్ష ఇటువంటిదే. అందుకే నేను గుండెల్ని ముక్కలు చేసిన ఆ ప్రపంచ కప్పు పరాజయానికి భారత జట్టు ఎలా స్పందించిందో ఒక ఎంపికగా ఈ వారం రాయదలచాను. గొప్ప వీరులను మీరు మీ హృదయ పీఠాలపై ప్రతిష్ఠించుకున్నప్పుడే, వారి రూపాలను పంకిలపరిచే లోపాలను సైతం సమస్థాయిలో అంగీకరించడం అన్నది కూడా మీ ఆరాధనలోని ఒక తప్పనిసరి బాధ్యత అవుతుంది.. ముఖ్యంగా టీవీల ప్రత్యక్ష ప్రసారంలో వీరులైన మీ జగజ్జెట్టీలను ప్రపంచం అంతా కళ్లింత చేసుకుని చూస్తున్నప్పుడు!

‘‘భారతజట్టులోని చాలామంది ఆటగాళ్లు... విజేతలైన ఆసీస్‌ జట్టులోని క్రీడాకారులతో కరచాలనం చేసిన తర్వాత మైదానం విడిచిపెట్టారు. కనీసం ప్యాట్‌ కమిన్స్‌ ట్రోఫీని పైకెత్తి చూపడాన్ని వీక్షించేంత వరకైనా అక్కడ ఉండలేకపోయారు’’ అని మేథ్యూ సాల్విన్‌ ‘న్యూస్‌.కామ్‌.ఎయు’లో రాశారు. అదే నిజమైతే అటువంటి ప్రవర్తన అమర్యాదకరమైనది మాత్రమే కాదు, క్షమించరానిది కూడా! ఈ ధోరణి భారత జట్టును, భారత ప్రజలను కూడా చెడుగా ప్రపంచానికి చూపెడుతుంది. 

విరాట్‌ కోహ్లీ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ అవార్డు అందు కున్నప్పుడు అతడి ప్రవర్తనను నాకు నేనుగా గమనించాను. అతడు నిరుత్సాహానికి గురవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ స్థాయికి తగని అతడి వైఖరి మాత్రం నేను అంగీకరించలేనిది. సచిన్‌ టెండూల్కర్‌తో మాత్రమే కరచాలనం చేసి, తక్కిన వాళ్లలో ఒక్కర్ని కూడా కోహ్లీ పట్టించుకోలేదు. అది అమర్యాద మాత్రమే కాదు, క్షమార్హం కాని స్వీయాధిక్య భావన కూడా! 

కోహ్లీని మాత్రమే నేనెందుకు వేరు చేసి చూస్తున్నాను? రెండు కారణాల వల్ల. కోట్లాది మందికి అతడు హీరో. తన ఆదర్శపాత్రను గొప్ప సంపదగా సృష్టించుకున్నవాడు. అతడేం చేస్తే వాళ్లు దానిని అనుసరిస్తారు. అంతేనా, అనుకరిస్తారు కూడా! అందుకే అతడి తప్పి దాలు కనిపించకుండా పోవు. ఒక స్టార్‌గా అతడు ప్రశంసలకు ఎలాగైతే అర్హుడో, విమర్శలకూ అంతే యోగ్యుడు.  

నేను కఠినంగా మాట్లాడుతున్నానని మీరు అనవచ్చు. పది వరుస విజయాల తర్వాత ఫైనల్‌లో ఓడిపోవడం హఠాత్ఘాతమే. తట్టుకోలేని దెబ్బే. అయితే అది ఒక వ్యక్తి ప్రవర్తనను, ప్రవర్తన విధా నాన్ని ప్రభావితం చేసినందువల్ల అతడిలో మనం ఆశించిన సౌమ్య తను, మర్యాదను అతడు విస్మరిస్తే దానిని మనం చూసీ చూడనట్లు వదిలేయాలా? అది నాకు సమ్మతి కాని వాదన. 

ఎందుకో నన్ను చెప్పనివ్వండి. 2021 యు.ఎస్‌. టెన్నిస్‌ ఓపెన్‌ మెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్‌... నొవాక్‌ జొకోవిచ్‌కి చాలా పెద్ద మ్యాచ్‌. అందరి మదిలోనూ ఒకటే, అతడు ఆ మ్యాచ్‌ని గెలిస్తే ఒకే ఏడాదిలో అది అతడి నాలుగో గ్రాండ్‌ స్లామ్‌ విజయం అవుతుంది. 1969 నాటి రాడ్‌ లేవర్‌ ఘనతకు అతడిని సమం చేస్తుంది. పురుషుల టెన్నిస్‌లో ఒక ఏడాదిలోని గ్రాండ్‌ స్లామ్‌లు అన్నింటిలో విజయం సాధించిన మూడవ వ్యక్తిగా చరిత్రలో నిలుస్తాడు. కానీ ఏమైంది? ఓడిపోయాడు! 

ఏ లెక్కన చూసినా గత ఆదివారం విరాట్‌ కోహ్లీ చవి చూసిన ఓటమి కన్నా కూడా జొకోవిచ్‌ది చాలా పెద్ద ఓటమి. అంతేకాదు – అది చిన్న సంగతేం కాదు – పైగా వ్యక్తిగతమైనది. కనుక అది అసలు సిసలు పరీక్ష.  జొకోవిచ్‌ అద్భుతంగా ఆడాడు. సందేహమే లేదు. అందుకే ఓటమి అతడిని కుంగదీసింది. అతడి కళ్లలో నీళ్లు చిప్పిల్లాయి. డేనియల్‌ మెద్వెదేవ్‌ అతడిని ఓడించిన క్షణాలలో జెకోవిచ్‌ అతడితో ఏమన్నాడో చూడండి: ‘‘ఈ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌కు అర్హులు ఎవరైనా ఉన్నారంటే అది మీరు మాత్రమే. చక్కగా ఆడారు. నిజంగానే చాలా చక్కగా! మంచి సమన్వయంతో ఉన్నారు.

గ్లాండ్‌ స్లామ్‌ ప్రస్తుత పర్య టనల్లోని గొప్ప ఆటగాళ్లలో మీరు ఒకరు. మన మధ్య మంచి స్నేహపూర్వకమైన పోటీ నడిచింది. మీరింకా మరిన్ని గ్లాండ్‌ స్లామ్‌లు గెలవాలని, మరిన్ని మేజర్‌ లీగ్స్‌లో ఆడాలని నేను కోరుకుంటున్నాను. మళ్లీ కూడా మీరు ఇలాంటి విజయాన్ని నిశ్చయంగా సాధించ గలరని నేను కచ్చితంగా చెప్పగలను’’ అని మెద్వేదేవ్‌ను మనస్ఫూర్తిగా అభినందించాడు జొకోవిచ్‌. 

అదీ క్రీడాస్ఫూర్తి అంటే. అదీ పెద్దరికం అంటే. దురదృష్టవశాత్తూ గతవారం మన క్రికెట్‌ జట్టు ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. ఇక జొకోవిచ్‌ ప్రేక్షకులను ఉద్దేశించి ఏమన్నాడో తెలుసా! ‘‘నేను మ్యాచ్‌ గెలవనప్పటికీ ఈ రాత్రి నా హృదయం పట్టనలవి కాని ఆనందంతో నిండి ఉందని మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ అభిమానంతో మీరు నాకు కలిగించిన ప్రత్యేకమైన అనుభూతి కారణంగా నేనిప్పుడు భూమి మీద జీవించి ఉన్నవారిలో అత్యంత సంతో షకరమైన వ్యక్తిని. మీరు నా హృదయాన్ని స్పృశించారు. న్యూయార్క్‌లో నేనెప్పుడూ ఇలా లేను. నిజాయతీగా చెబుతున్నాను. నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను మిత్రులారా! నాకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు నాకోసం చేసిన ప్రతిదానికీ కూడా’’ అని ఉద్వేగంగా మాట్లాడాడు.  

మన క్రికెటర్లు– ప్రధానంగా కోహ్లీ – గొప్ప క్రీడాకారులే అయినప్పటికీ వారు తమ ఓటమిని హుందాగా ఎలా స్వీకరించాలో నేటికింకా నేర్చుకోవలసే ఉంది. ఇందుకు రెండు కావాలి. మొదటిది క్రీడా పరాక్రమం. రెండోది శ్రేష్ఠమైన అంతఃచేతనాశక్తి. రెండోది లేకుండా మాత్రం నిజంగా మీరు గొప్పవారు కాలేరు.
కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు