కవిత్వంలో ఉన్నంత సేపూ...

24 Apr, 2017 01:30 IST|Sakshi
కవిత్వంలో ఉన్నంత సేపూ...
అరణ్యకృష్ణ రెండో కవితాసంకలనం ‘కవిత్వంలో ఉన్నంత సేపూ...’ విడుదలైన సందర్భంగా ఈ ఐదు ప్రశ్నలు...
‘నెత్తురోడుతున్న పదచిత్రం’(1994) తర్వాత, రెండు దశాబ్దాలకు రెండో సంకలనం తెచ్చారు. ఎందుకింత విరామం వచ్చింది?
1994 వరకూ నేను కవిత్వం రాసినప్పటి పరిస్థితులు ఆ తర్వాత లేవు. పౌరహక్కుల ఉద్యమం, వామపక్ష మొగ్గు... వాటి నిమగ్నతలో రాశాను. ఆ తర్వాత వట్టిపోయిన భావనేదో వచ్చింది. అదొక నిర్ణయంగా కాదుగానీ, మనం ఏమీ చేయనప్పుడు ఏమీ చెప్పకూడదు; అది తప్పేమో అనుకోవడం వల్ల రాయలేకపోయాను.
 
మరి అంతకాలం మీలోని కవి ఏం చేశాడు?
ముందు నేను యాక్టివిస్టును; యాదృచ్ఛికంగా కవిని. కవిత్వానికి అంతగా అలవాటు పడలేదు. రాసినవి రాయకుండా ఉండలేనప్పుడే రాసినప్ప టికీ, నేను రాయకుండా కూడా ఉండగలను.
 
మళ్లీ ఇప్పుడు రాసేందుకు ప్రేరణ ఏమిటి?
భావజాల పరంగానూ, తాత్వికంగానూ అప్పుడు నేను ఏ విలువల్ని వ్యతిరేకించానో
అవి అలాగే ఉన్నాయి; వాటి మీద ప్రేమేం కలగలేదు. ఏమీ చేయలేకపోతున్నామే అన్న భావన, లక్ష్యం లేని జీవితం అయిందన్న వేదన, రాయడం కూడా ఒక కార్యాచరణే అనే రియలైజేషన్‌... మళ్లీ రాసేలా ప్రేరేపించాయి.
 
‘కవిత్వంలో ఉన్నంత సేపూ...’ అన్నారు? ఉన్నంతసేపు ఏమవుతుంది?
కవిత్వం ఒక థాట్‌ ప్రాసెస్‌. అందులో ఉన్నప్పుడు నాకు నేను నిజాయితీగా ఉంటాను. నాలోనీ, సమాజంలోనీ  వైరుధ్యాలు స్పష్టంగా కనబడతాయి. జర్నీ ఇంటూ ద రియామ్‌ ఆఫ్‌ సెల్ఫ్‌ అనొచ్చు.
 
మీ కవిత్వం మీకు అవసరమా? సమాజానికా?
ముందు నాకే అవసరం. రాయడం కమ్యూనికేట్‌ చేయడం కోసమే రాసినా రాయకపోతే నష్టపోయేది నేనే!  బ్రహ్మపదార్థంలా చెబుతున్నాననుకోవద్దు... ప్రతి కవిత ఒక ఎరుక! కాబట్టి నా కవితలకు ప్రధాన లబ్ధిదారుణ్ని నేనే!
 
                                                                                                 (కవిత్వంలో ఉన్నంత సేపూ...; కవి: అరణ్యకృష్ణ;
                                                                                                    ప్రచురణ: నవ్య పబ్లికేషన్స్‌; కవి ఫోన్‌: 8978720164)
మరిన్ని వార్తలు