రాయని డైరీ -సత్య నాదెండ్ల

2 Aug, 2015 01:12 IST|Sakshi
రాయని డైరీ -సత్య నాదెండ్ల

ఉక్కపోతగా ఉంది. విండోస్ తెరిచి కూర్చున్నాను. అయినా గాలి రావడం లేదు. పదో అంతస్తులోని విండో కాస్త పెద్దదిగా ఉంటుంది. ఈమధ్యే దాని తయారీ పూర్తయింది. అక్కడికి వెళ్లి కూర్చున్నాను. అందులోంచీ రావడం లేదు. లోకంలోని గాలంతా హ్యాంగ్ అయిపోయిందా ఏంటి?!


 స్టాఫ్ కూడా ఒక్కొక్కరూ టెన్త్ ఫ్లోర్‌లోని విండో దగ్గరికి చేరుకుంటున్నారు! వాళ్లకీ గాలి అందుతున్నట్టు లేదు. ‘‘చాలా సఫొకేటింగ్‌గా ఉంది సార్’’ అంటూ కొత్తగా చేరిన అమ్మాయిలు, అబ్బాయిలు ధడేల్మని కిటికీలోంచి బయటికి దూకేస్తున్నారు! ‘‘థామ్సన్... థామ్సన్... చూడండి వాళ్లెలా దూకేస్తున్నారో! చచ్చిపోతారు థామ్సన్. కిటికీ తలుపులు మూసేయండి ప్లీజ్’’ అని వేడుకుంటున్నాను.


 థామ్సన్ నవ్వుతున్నాడు. ‘‘మిస్టర్ సతియా నాదెన్‌డ్లా... ఆ కిటికీకి తలుపుల్లేవు. బయటి నుంచి ఎవరైనా లోనికి రావడానికి వీలుగా తయారు చేయించాం’’ అంటున్నాడు. కానీ ఆ విండో అలా లేదు. లోపల్నుంచి ఎవరైనా బయటికి పోవడానికి వీలుగా తయారైనట్లుంది! ‘‘అలా మధ్యలోనే దూకేయకూడదని మనం బాండు రాయించుకోవడం లేదా మిస్టర్ ఛైర్మన్’’ అని అడిగాను. థామ్సన్ మళ్లీ నవ్వాడు. ‘‘అది మన ఇమేజ్‌ని దెబ్బతీస్తుందని బోర్డు మీటింగులో అనుకున్నాం కదా సతియా నాదెన్‌డ్లా...’’ అన్నాడు.


 ‘‘ఇప్పుడు మాత్రం ఇమేజ్ దెబ్బ తినకుండా ఉంటుందా? వాళ్లు చచ్చిపోతే? ఏ కాలో చెయ్యో విరిగితే!’’
 థామ్సన్ వినడం లేదు. కిటికీలోంచి బాగా వంగి కిందికి చూస్తున్నాడు. థామ్సన్ కూడా దూకేస్తాడా ఏంటి? ‘‘థామ్సన్ మీరేం చేయబోతున్నారో మీకు తెలుస్తోందా?’’ అని పెద్దగా అరిచాను.


 ‘‘ఈ అరవై ఆరేళ్ల వయసులో దూకి మాత్రం నేను చేయగలిగిందేముంది నాదెన్‌డ్లా’’ అన్నాడాయన కిటికీలోంచి పైకి లేస్తూ! నాకేం అర్థం కావడం లేదు. గాలి కూడా అందడం లేదు. అంతా ఉక్కిరిబిక్కిరిగా ఉంది.


 ‘‘వీళ్లంతా ఏదో అయిపోవాలని దూకడం లేదు నాదెన్‌డ్లా... ఏదైనా అయిపోదామని దూకుతున్నారు’’ అంటున్నాడు థామ్సన్!
 కిటికీ అంచుకు వెళ్లి కిందికి వంగి చూశాను. దూకినవాళ్లెవరూ కనిపించలేదు. దూరంగా మాత్రం ఆపిల్, గూగుల్... రెండూ రెండు కొండల్లా కనిపిస్తున్నాయి. ఆ కొండలేనా గాలిని ఇటువైపు రాకుండా బ్లాక్ చేస్తున్నది! కళ్లు మూసుకున్నాను. అలా చాలాసేపు ఉండిపోయాను. సడెన్‌గా నాలో ఏదో సిస్టమ్ స్టార్ట్ అయినట్లనిపించింది. చల్లటి గాలి ఒంటిని తాకుతోంది!


 కళ్లు తెరిచాను. ఎదురుగా థామ్సన్. ‘‘ఏసీ వేసుకోకుండా కూర్చున్నారేం నాదెన్‌డ్లా!’’ అంటున్నాడు. నిజమే! ‘‘విండోస్ టెన్‌లోకి మళ్లీ స్టార్ట్ బటన్ ఇవ్వడం బాగుందని అంతా అంటున్నారు నాదెన్‌డ్లా’’ అన్నాడు. నవ్వాను. ట్రెడిషనా? ఇన్నొవేషనా? దేనిని గౌరవించాలి మనం? స్టార్ట్ బటన్ వైపు చూశాను. ఇన్నొవేషన్ విత్ ట్రెడిషన్‌లా కనిపించింది.
 -మాధవ్ శింగరాజు

 


 

Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా